మరికొద్ది రోజుల్లో మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవమిది. అయితే ఈ ఉత్సవం జరుపుతున్నందుకు భిన్నాభిప్రాయాలు అనేకం వున్నాయి. స్త్రీలంటే వుండే కొంత వ్యంగ్యంతో ‘స్త్రీల దినమిది’ అనే మాటలు వింటుంటాం. ఒక్కరోజు తల్చుకుంటే సరిపోయిందా అనే మాట ఒకటి చలామణిలో వుంది. తమకు ఏమాత్రం సంబంధం లేని క్రతువు మాత్రమే అనే పురుషులూ ఉన్నారు. స్త్రీల ఆధిక్యతను, శ్రమశక్తిని గుర్తు చేసి చెప్పే ప్రకటించే రోజిది అన్నవాళ్ళు ఉన్నారు.
నిజానికి సమాజానికి రెండు సమాన భాగాలైన స్త్రీ, పురుషులు ఇరువురూ కలిసి చేయాల్సిన ఉత్సవమిది. కొత్త కొత్త ఒప్పందాలు, నిర్ణయాలు చేసుకోవాల్సిన రోజిది. స్త్రీలు సాధించిన విజయాలు, ఈరోజు ప్రాముఖ్యత, స్త్రీలు ఎదుర్కొన్న విషయాలు, స్త్రీలు పోరాడి సాధించుకున్న వైనాలు ఒకటేమిటి? ఎన్నెన్నో ఆధునిక విషయాలను తలుచుకో వచ్చును. కానీ, కొన్ని చోట్ల ఇది కేవలం స్త్రీలకు సంబంధించేదేనంటూ, ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ వంటి రోటీన్ ఆటలు కొన్ని, గిఫ్ట్‌లు, ఆఫీసుల్లో సైతం పూజాకార్యక్రమాలు, వేదికల మీద కుప్పలుగా స్త్రీలను కూర్చోబెట్టి, తామెంతో అవకాశమిచ్చామని గర్వించే వైఖరులు, ఈ ఒక్కరోజుకే మేం చేయంగానీ, హౌటల్ నుంచో, జుమోటో నుంచే తెచ్చుకోండనే రాయితీలు వెరసి, స్త్రీ ఒక ఆటబొమ్మగా, విలాస వస్తువుగా, కుటుంబాలను మోసే భార వాహికలుగా, రెండవ శ్రేణి మనుషులుగా ఇంకా చూడబడుతున్న స్థితి నేటికీ కొనసాగుతుంది.
శ్రమకు ప్రతిఫలం కావాలి
మారాలి… మనుషులు ఇకనైనా కొంత వరకన్నా మారాలి. ఏదో ఒక్క క్షణంలో రాదుకదా! ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ శ్రమకు ప్రతిఫలం కావాలి. ఆధునికులు అనుకున్న కొందరిలో కూడా ఇంకా ఛాందసవాదాల పేరిట, సంస్కృతి పేరిట పాత భావాలే కొనసాగుతున్నాయి. ఈతరం వ్యక్తుల్ని చూసినప్పుడు ఆశ మళ్ళీ చిగురిస్తోంది. భావ విప్లవాలు వచ్చాయి. ఒకరినొకరు గౌరవించుకునే స్థితి వచ్చింది. బలవంతంగా కలిసుండే స్థితులు తగ్గి, ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన సమానస్థితిని కొందరైనా సాధించుకోగలుగుతున్నారు అన్నది అంగీకరించాల్సిన నిజం.
ప్రశ్నే మార్పు తెచ్చింది
ముఖ్యంగా సాహిత్యం జీవితాల్లో భాగమై పోయాక స్త్రీవాదం స్పష్టమైన రూపంతో కనిపించిన, ఆలోచనా ధోరణుల్లో చాలా మార్పులొచ్చాయి. ‘ప్రశ్న నుండే జ్ఞానం ఉదయిస్తుంది అన్నట్టుగా ప్రశ్నలే, తిరుగుబాటే స్త్రీలల్లో పెను మార్పులు తెచ్చింది. ఇవాళ స్త్రీలు సాధించుకున్న విజయాల వెనుక స్త్రీల చైతన్యం, పట్టుదల, ధైర్యం, సాహసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి.
పెంపకంలో మార్పు రావాలి
శ్రామిక స్త్రీలు దోపిడీని ఎదుర్కొన్న స్థితి, ప్రపంచ వ్యాప్తంగా ‘ధీర’లుగా నిలబడ్డ పరిస్థితి మనం అంగీకరించాల్సిందే. స్త్రీ పురుషుల ఆలోచనా విధానాల్లో మార్పు వచ్చినప్పుడు సమాజం, కుటుంబాలు బాగుపడతాయి. జెండర్ వివక్ష కుటుంబాల్లోని మూల స్వభావంగా మారి పోవడాన్ని గమనించాలి. పిల్లల పెంపకంలో తగు మార్పులు రావాలి. ఒకటిగానే పెంచాలి. చిన్నప్పటి నుంచీ పెంచిన, పెరిగిన విధానాలే పెద్దయ్యాక కనిపిస్తాయి. ఆడగా, మగగా కాక ఒకటిగా పెంచాలి. కూతురు, కోడలు, కొడుకు, అల్లుడు అందరిపై ఒకే ధోరణితో వుండాలి. కుటుంబాల మూల స్వాభావంలో మార్పు రాకుండా పిల్లలో మార్పు రావడం చాలా కష్టం.
శీలమంటే అర్థం మారాలి
పని విభన కూడా ఉండొద్దు. ఇంటిపని, పిల్లల్ని కనేపని, పెంచేపని, కుటుంబ పెద్దల్ని చూసే పని, ఉద్యోగం చేసే పని, ఊడిగం చేసే పని ఉండొద్దు. ఆర్థిక స్వాతంత్య్రం లేని స్థితి ఇవన్నీ ఉన్నాయి. స్త్రీ తనను తానొక మనిషిగా గుర్తుంచుకోవడంతో పాటు, దేన్నయినా సాధించుకోగలిగిన శక్తిని గుర్తెరగాలి. తమ మేధో సంపద ద్వారా ఎలాంటి చిక్కుముడులైనా విప్పగల ‘ధీర’ స్త్రీ. అటువంటి స్త్రీగా పుట్టినందుకు గర్వించగలగాలేకానీ, న్యూనతకు గురికావొద్దు. శీలమంటే ఉన్న అర్థం మారాలి. ఇది ఇరువురికీ సంబంధించింది. శరీరపు దాడిగా మాత్రమే గుర్తించాలి, గుర్తిస్తున్నారు కూడా.
విజయకేతనం ఈరోజు
అయితే స్త్రీలు సాధించుకున్న అనేక విజయాలను ఈరోజు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న తీరుతెన్నులు గర్వకారణమే. 30 ఏండ్ల కిందట రాసిన కవిత్వంలో వున్న స్త్రీల స్థితే ఈనాటికీ కొనసాగుతుండటం చూసి నిర్వేదం కలగక తప్పదు. అప్పటిలానే స్త్రీలింకా హింసకు గురవుతూనే ఉన్నారు. హింసల్లో మార్పులొచ్చాయి. క్రూరత్వం మరింత పెరిగింది. ఇది కొంచెం బాధించే అంశమైనప్పటికీ, ఈతరపు స్త్రీలు మారిన వైఖరులు బతుకు పట్ల గొప్ప ఆశల్ని చిగురింప చేస్తున్నాయి. మహిళలు సాధించిన, సాధించుకుంటున్న విజయకేతనం ఈరోజు. ఈరోజు మనం గొప్ప ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, విజయాలను సాధించుకున్న ‘ధీర’లుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న విలువైన రోజిది. రేపటి తరాలకు మరో మైలురాయి.
– శిలాలోలిత