విటమిన్లు మెండుగా

విటమిన్లు మెండుగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. విటమిన్‌ ఎ, బి, సి, డి మెండుగా ఉండే ఈ వంటకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

 

 

 

క్యారెట్‌ మెంతి కూర
కావల్సిన పదార్థాలు: నాలుగు పలకలుగా కోసిన క్యారెట్‌ ముక్కలు – రెండు కప్పులు, మెంతి ఆకులు – రెండు కప్పులు, నూనె – రెండు టీస్పూన్లు, జీలకర్ర – అర టీస్పూను, ఉల్లిగడ్డ ముక్కలు – ముప్పావు కప్పు, పచ్చిమిర్చి – ముక్కలు – టీస్పూను, వెల్లుల్లి తురుము – టీస్పూను, పసుపు – పావు టీస్పూను, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు, ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం: కడాయిలో నూనె పోసి వేడి చేసి, జీలకర్ర వేయాలి. అది చిటపటలాడాక ఉల్లిగడ్డ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తురుము వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు తురుమిన మెంతాకులు, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి. తర్వాత క్యారెట్‌ ముక్కలు, ఉప్పు, కప్పు నీళ్లు పోసి మూత పెట్టి క్యారెట్‌ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఈ కూర అన్నం, చపాతీల్లోకి చాలా బాగుటుంది.
విటమిన్‌ -ఎ
ఎముకలు, దంతాలు, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి ఈ విటమిన్‌ ఎంతో అవసరం. రేచీకటిని దరిచేరనీయదు. చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ విటమిన్‌ క్యారెట్‌, మోరంగడ్డ, పాలకూర, ఎర్ర మిర్చిల్లో ఉంటుంది.

 

అరెంజ్‌ పోహా
కావల్సిన పదార్థాలు: అటుకులు – కప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు – రెండు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి – రెండు, ఆవాలు – అరటీస్పూను, కరివేపాకు – రెబ్బ, పసుపు – పావు టీస్పూను, కారం – టీస్పూను, నూనె – టేబుల్‌స్పూను, తాజా ఆరెంజ్‌ జ్యూస్‌ – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, నానబెట్టిన ఎండుద్రాక్ష – రెండు టేబుల్‌ స్పూన్లు.
తయారు చేసే విధానం: అటుకులను రెండుసార్లు కడిగి నీళ్లు పోయేలా జాలీలో వేయాలి. వీటిని కమలారసంలో కాసేపు నానబెట్టాలి. కడాయిలో నూనె పోసి వేడి చేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి తక్కువ మంట మీద వేయించాలి. దీంట్లో అటుకులు వేసి మరికాసేపు వేయించి మూతపెట్టి మగ్గించాలి. దింపిన తర్వాత ఐదు నిమిషాలపాటు అలాగే ఉంచిన తర్వాత మూత తీయాలి. చివరగా నానబెట్టిన ఎండ్రుద్రాక్షతో అలంకరించాలి.
విటమిన్‌ – సి
ఈ విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మజాతి పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, బ్రకోలి, ఆకుకూరలు నుంచి లభిస్తుంది.

 

మినపప్పు కూర
కావల్సిన పదార్థాలు: పొట్టు మినపప్పు – కప్పు, పెరుగు – అరకప్పు, నూనె – రెండు టీస్పూన్లు, జీలకర్ర – అర టీస్పూను, ఇంగువ – పావు టీస్పూను, కరివేపాకు – రెబ్బ, పచ్చిమిర్చి – పేస్టు – టీస్పూను, అల్లం పేస్టు – అర టీస్పూను, ఉప్పు సరిపడా, కొత్తిమీర తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు. తయారు
చేసే విధానం: పొట్టు మినపప్పును శుభ్రంగా కడగాలి. ఫ్రెషర్‌కుక్కలో ఒకటిన్నర కప్పుల నీళ్లుపోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. గిన్నెలో ఉడికించిన మినపప్పు వేసి దాంట్లో పెరుగు, ఒకటిన్నర కప్పుల నీరు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి తురుము చేర్చి కాసేపు వేయించి తర్వాత మినపప్పు మిశ్రమాన్ని జతచేసి బాగా కలుపుతూ కాసేపు ఉడికించి దించేయాలి. చివరగా కొత్తిమీర తురుము వేయాలి. రోటీలలో తింటే ఇది చాలా బాగుంటుంది.
విటమిన్‌ – బి
నరాలు సక్రమంగా పని చేయడానికి, ఎర్రరక్త కణాలు ఏర్పడటానికి, రక్తహీనతను నివారించడానికి, మెదడు చురుగ్గా పని చేయడానికి, జీవక్రియ సక్రమంగా జరగడానికి విటమిన్‌ – బి6, బి-12, బి-9 ఉపకరిస్తాయి. మాంసం, కిచెన్‌, చేప, సముద్ర ఉత్పత్తులు, గుడ్లు, పాల నుంచి ఇవి లభిస్తాయి.
పుట్టగొడుగుల కూర
కావల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు – పది, నూనె – మూడు టీస్పూన్లు, చిన్న దాల్చిన చెక్క – ఒకటి, జీలకర్ర – అర టీస్పూను, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ – ఒకటి, అల్లం – వెల్లుల్లి పేస్టు – టేబుల్‌ స్పూన్‌, చిన్నగా కోసిన టొమాటోలు – రెండు, పసుపు – అర టీస్పూను, గరం మసాలా పొడి – అర టీస్పూను, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, జీడిపప్పు పేస్టు – పావు కప్పు, కొత్తిమీర తురుము – రెండు టేబుల్‌స్పూను, కసూరిమేధి – అరటీస్పూను.
మసాలా పొడికి : ధనియాలు – టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, మిరియాల పొడి – పావు టీస్పూను, ఎండుమిర్చి – నాలుగు.
తయారు చేసే విధానం: ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చిని నూనె లేకుండా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర, దాల్చినచెక్క వేయాలి. దీంట్లో ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి తర్వాత టమాటా ముక్కలు వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. దీంట్లో పసుపు, గరం మసాలా పొడి, ముందుగా తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడి, ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు పుట్టగొడుగు ముక్కలు వేసి వేయించి పైన మూతపెట్టాలి. తర్వాత కప్పు నీళ్లు పోసి, జీడిపప్పు పేస్టు వేసి బాగా కలపాలి. మూతపెట్టి పుట్టగొడుగు ముక్కలు మొత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర తురుము, కసూరీమేధి వేసి బాగా కలిపితే బాగుంటుంది.
విటమిన్‌ – డి
ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచే ఈ విటమిన్‌ సాల్మన్‌ చేపలు, క్యాట్‌ఫిష్‌, ఆల్చిప్పలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగులు, సూర్యరశ్శి నుంచి లభిస్తుంది.

Spread the love