విద్యార్థులు ధైర్యంగా ఉండాలి

– డాక్టర్‌ ప్రీతిని పరామర్శించిన గవర్నర్‌ తమిళిసై
– పూర్తి స్థాయిలో విచారణ :మంత్రి హరీశ్‌ రావు
– దోషులపై చర్యలు తీసుకోవాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెరవకుండా విద్యార్థులు ధైర్యంగా ఉండాలంటూ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సూచించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న డాక్టర్‌ ప్రీతిని ఆమె గురువారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘ప్రీతి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పలేం. ఆ సంఘటనలో పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ డాక్టర్లకు చెప్పాను. చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రీతి తెలివైన విద్యార్థి అని తెలిసింది. ఆమె యూపీఎస్పీ కూడా క్లియర్‌ చేసిందని తల్లిదండ్రులు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన, సున్నితమైన పరిస్థితి. మెడికల్‌ హెల్ప్‌ ప్రొసీజర్‌ను పూర్తి చేయాలని డాక్టర్లను కోరాను….’ అని గవర్నర్‌ తెలిపారు.
ప్రీతి ఘటనపై….పూర్తి స్థాయిలో విచారణ:మంత్రి హరీశ్‌ రావు
డాక్టర్‌ ప్రీతి విషయంలో జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ధైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను కోరారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్యులతో గంట గంటకు మంత్రి స్వయంగా మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రీతికి మెరుగైన వైద్యమందించాలని డాక్టర్లను మంత్రి ఆదేశించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నదనీ, ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హరీశ్‌ రావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
దోషులపై చర్యలు తీసుకోవాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ)లో పీజీ విద్యార్థినిపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్‌ విద్యార్థిపై ర్యాగింగ్‌ నిరోధక చట్టం ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి అనే విద్యార్థినిపై సీనియర్‌ విద్యార్థి వేధింపులతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు నిమ్స్‌ వైద్యులు ప్రకటించారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ హెచ్చరించేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వరుసగా ర్యాగింగ్‌ ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వరుసగా ఇది రాష్ట్రంలో మూడో ఘటన అని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పై అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ర్యాగింగ్‌ రక్కసిని ఎదుర్కొనేందుకు పక్కాగా చట్టాన్ని అమలు చేయాలని కోరారు. అన్ని విద్యాసంస్థల్లో దీనిపై అవగాహన సదస్సులు నిర్వహించి, విద్యార్థులను చైతన్యవంతం చేయాలని సూచించారు. ఆ విద్యార్థినికి అన్ని రకాలుగా మెరుగైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love