విద్యుత్‌ వినియోగదారులపై అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలి

– 31న మండల స్థాయిలో ధర్నా : ప్రజాపంథా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అడ్వాన్స్‌ కంజంప్షన్‌ డిపాజిట్‌ (ఏసీడీ) పేరుతో విద్యుత్‌ వినియోగదారులపై అదనపు ఛార్జీలను మోపడాన్ని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 31న మండలస్థాయిలో విద్యుత్‌ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు మరింత కష్టాల్లోకి కూరుకుపోయి విద్యుత్‌ వినియోగానికి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం, అడ్వాన్స్‌ పేరుతో ప్రభుత్వం వసూళ్లకు పూనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ 24 గంటలపాటు ఇస్తున్నామంటూ కోతలు ప్రారంభించిందని తెలిపారు. తన నష్టాలను ప్రజలపై మోపడానికి కుట్ర పన్నుతున్నదని పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ స్వతంత్రంగా ఆలోచించకుండా ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలుకుతున్నదని విమర్శించారు.

Spread the love