అ అంటే అమ్మ, ఆ అంటే ఆకలి తప్ప కులం, మతం లాంటి పెద్దపెద్ద మాటలు తెలియని విద్యార్థులు నేడు సమాజంలో వివక్షకు గురైతే దేశం ఎటువైపు వెళ్తున్నట్టు? విద్యాబుద్దులు నేర్చుకుని మెరుగైన సమాజం కోసం పాటుపడే భావిభారత పౌరులను తయారు చేసే విద్యాలయాల్లోకి కూడా కులం అనే విషసంస్కృతి చేరితే చదువు నేర్చుకోవడం ఉంటుందా? ఇవి ఇలాగే కొనసాగితే పేద,మధ్య అంతరాలు కూడా పెరిగే అవకాశమున్నది. దీన్ని మార్చేందుకు ఎవరు రావాలి?.అంబేద్కర్ కలలుగన్న వివక్షత లేని సమాజాన్ని కాంక్షిస్తే గనుక మనమే దీన్ని అరికట్టేందుకు నడుం బిగించాలి. ఎక్కడ కులం పేరుతో దూషించినా అక్కడే ప్రతిఘటించాలి.ఎక్కడ వివక్ష ఎదురైతే అక్కడే తిరుగుబాటు చేయాలి. లేదంటే దేశం తిరోగమనంలో పడుతుంది.మళ్లీ బానిస సమాజంలోకి మారుతుంది.
సమాజంలో రోజురోజుకూ వివక్ష జడలు విప్పుతోంది.. నువ్వెవరూ అని ప్రశ్నిస్తోంది.. నీకులమెంటని అడుగుతోంది.. దూరంగా ఉండమని చెబుతోంది. గుడిలోకి రాకుండా ఆంక్షలు పెడుతోంది. చివరకు బడిలోకి అడుగుపెట్టింది. కులం గురించి ఎవరినడిగినా ‘వేయు తలల నాగుపాము’గా వర్ణిస్తారు. కానీ అది ఒక్కొక్కరిని కాటేసి విషం చిమ్ముతుంటే మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తారు. ఇదీ నేటి లోకం తీరు! ఓ వైపు అంతరిక్షంపై పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగినా మనం నేటికీ కులం, మతం, ప్రాంతం, అంటరానితనం గురించి మాట్లాడుకునే పరిస్థితికి కారణం ఎవరు? మనుషులా లేక మనుస్మృతిని మనపై రుద్దిన ఏలికలా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు? కులం పేరుతో విద్యార్థులను అవమానించడం, చితకబాది తీవ్రగాయాలపాలు చేసిన ఘటనలనేకం. కానీ అవి హద్దులు దాటి హత్యలకు కూడా దారితీస్తుండటం ఆందోళనకరం. రాజస్తాన్‌లోని పాఠశాలలో కుండలో నీటిని తాగిన చిన్నారిని కులం పేరుతో కొట్టడంతో చనిపోయాడు.ఈ ఉదంతం మరవక ముందే ఉత్తరప్రదేశ్‌లోని కళాశాలలో టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్‌లో నీటిని తాగినందుకు ప్రిన్సిపాల్ విద్యార్థిని దారుణంగా హింసించాడు. తోటి విద్యార్థులు వివక్ష చూపించినందుకు గాను మహారాష్ట్రలో ఐఐటీ విద్యార్థి బిల్డింగ్‌పై దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు దేశానికి ఏం నేర్పుతున్నాయి? విద్యార్థులను కూడా అంటరానివారిగా చిత్రీకరిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్‌లోని ఓ స్కూల్‌లో ఆదివారం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన దళిత విద్యార్థి టేబుల్‌పై ఉన్న వాటర్‌బాటిల్‌ను తీసుకుని నీటిని తాగాడు. విషయం తెలుసుకున్న ఆ స్కూల్ ప్రిన్సిపాల్ యోగేంద్రకుమార్ అతని సోదరులు కలిసి ఆ విద్యార్థిని తీవ్రంగా కొట్టారు. కులం పేరుతో దూషించారు. ఇదేం అన్యాయం? ఎక్కడున్నాం మనం? ఏమైపోతోంది సమాజం? దాహం వేసి నీళ్లు తాగితే ఇంత దారుణంగా హింసిస్తారా? ఈ ఒక్క ఘటనే కాదు ఐఐటి బొంబాయి ఇన్‌స్టిట్యూట్‌లో బిటెక్ విద్యార్థి దర్శన్ సోలంకి హాస్టల్ బిల్డింగ్‌లోని ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కులవివక్షే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.. వాస్తవానికి ఇనిస్టిట్యూట్‌లో కులవివక్ష ఉందని, కులం తక్కువవాడని తనతో ఎవరూ స్నేహం చేయడం లేదని దర్శన్ తన సోదరునితో వాపోయాడు. ఇవే కాదు రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోనూ ఎనిమిది నెలల కిందట ఇలాంటి ఘటనే జరిగింది. జూలై ఇరవైన సురానా గ్రామంలోని సరస్వతీ విద్యా మందిర్ అనే ప్రయివేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఛైల్ సింగ్ తొమ్మిదేండ్ల విద్యార్థి ఇందర్ మేఫ్‌ువాల్‌ను తీవ్రంగా కొట్టాడు. దానికి కారణం అగ్రవర్ణాల ఉపాధ్యాయుల కోసం పెట్టిన మట్టి కుండను ముట్టుకుని అందులోని నీరు తాగడం. విద్యార్థి తలమీద బాదడంతో కన్ను దెబ్బతింది. చెవి నరాలు చితికిపోయాయి. ఇరవై నాలుగు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బెడ్‌మీదనే కన్నుమూశాడు.
ఏం చేశాడని ఈ చిన్నారికి ఇంత పెద్ద శిక్ష? అతనిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? రాజస్తాన్ ఘటనను సీరియస్‌గా తీసుకుంటే గనుక ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో మరో ఘటన పునరావృతం కాకుండా ఉండేదికదా! రేపు మరో రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా గ్యారంటీ ఇవ్వగలరా? రోజు రోజుకూ కులం పేరుతో ఇంతటి దారుణాలకు ఒడిగడుతుంటే వెనుకబడిన,అణచబడిన కులాలు పిల్లలు సమాజంలో స్వేచ్ఛగా ఎలా తిరుగుతారు? వారికి రక్షణ ఉందా లేదా? ఇప్పటికే గ్రామాల్లో కులం వేళ్లూనుకుపోయింది. అణగారిన వర్గాలు రచ్చబండ దగ్గర కూర్చున్నా వివక్షే. బావిలో నీళ్లు తోడుకున్నా వివక్షే. చివరకు శ్మశానంలో కూడా వివక్షే.ఉన్నోడు, లేనోడు అని ఆరడుగుల జాగ కోసం కొట్లాడుకుంటున్న దుస్థితి. దళితులు ఇండ్లలోకి వచ్చినా, హోటళ్లకు వెళ్లినా రెండుగ్లాసుల పద్ధతిని అవలంభిస్తున్న తీరు కనిపిస్తున్నదే. అ అంటే అమ్మ, ఆ అంటే ఆకలి తప్ప కులం, మతం లాంటి పెద్దపెద్ద మాటలు తెలియని విద్యార్థులు నేడు సమాజంలో వివక్షకు గురైతే దేశం ఎటువైపు వెళ్తున్నట్టు? విద్యాబుద్దులు నేర్చుకుని మెరుగైన సమాజం కోసం పాటుపడే భావిభారత పౌరులను తయారు చేసే విద్యాలయాల్లోకి కూడా కులం అనే విషసంస్కృతి చేరితే చదువు నేర్చుకోవడం ఉంటుందా? ఇవి ఇలాగే కొనసాగితే పేద, మధ్య అంతరాలు కూడా పెరిగే అవకాశమున్నది. దీన్ని మార్చేందుకు ఎవరు రావాలి?.అంబేద్కర్ కలలుగన్న వివక్షత లేని సమాజాన్ని కాంక్షిస్తే గనుక మనమే దీన్ని అరికట్టేందుకు నడుం బిగించాలి. ఎక్కడ కులం పేరుతో దూషించినా అక్కడే ప్రతిఘటించాలి. ఎక్కడ వివక్ష ఎదురైతే అక్కడే తిరుగుబాటు చేయాలి. లేదంటే దేశం తిరోగమనంలో పడుతుంది. మళ్లీ బానిస సమాజంలోకి మారుతుంది.