నవతెలంగాణ – అమరావతి
విశాఖపట్నంలో మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మరో ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజితభార్గవ్తో కలిసి మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జీ-20 దేశాలైన అర్టెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, ఇంగ్లండ్, అమెరికా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్లోని 19 సభ్య దేశాలు, 300 మంది వరకు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.