నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగా పెంచి మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట పేరుతో ప్రచారం చేసుకోవటం సమంజసం కాదని టీఎస్‌యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. రాజారావు, ఎ.శ్యామ్ సుందర్ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత, కొత్త పన్ను విధానాలను కొనసాగిస్తూ క్రమంగా పాత పన్ను విధానాన్ని ఎత్తివేయటానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని, పరోక్ష పన్నుల ద్వారా వేతనాల నుంచి ఆదాయాన్ని రాబట్టుకుంటున్న ప్రభుత్వం వేతనాలపై భారీగా పన్ను వేయటమే అర్థరహితమని పేర్కొన్నారు. కార్పొరేట్లు, ధనికులకు అధిక పన్ను రాయితీ ఇచ్చిన సర్కారు చిన్న, మధ్యతరగతి ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించలేదన్నారు. కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీ రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంచారు కానీ కొత్త విధానంలో ఎలాంటి మినహాయిం పులుండవని.. అధికాదాయ వర్గాలకు మాత్రమే ఇది కొంత మేరకు ఉపయోగకరమని చెప్పారు. తక్కువ వేతనాదాయ వర్గాలు వినియోగించుకుంటున్న పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి 3లక్షలకు పెంచటం నామమాత్రమేనని.. పొదుపు మొత్తాలపై రాయితీని రూ.1.50 లక్షలను అలాగే కొనసాగించారని తెలిపారు. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసిన స్టాండర్డ్ డిడక్షన్ రూ.5 లక్షలు గానీ పొదుపు మొత్తాలపై రూ.3 లక్షలకు పెంచాలన్న డిమాండ్ కానీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్ల తర్వాత కూడా అమలు చేయలేదన్నారు. స్లాబు రేట్లు సవరణ కూడా స్వల్పంగానే ఉందని, ఈ బడ్జెట్ ద్వారా ధరలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదన్నారు. గృహ నిర్మాణానికి ప్రోత్సాహం లేదని, మొత్తంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్ సగటు వేతన జీవులకు ఏమాత్రం సంతృప్తి కలిగించలేదన్నారు.