వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర

– బడ్జెట్‌ ప్రతుల దహనం కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌
– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు అన్నారు. తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కేంద్ర బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కోతల విధించడం దుర్మార్గం అన్నారు. 2023-24లో కేంద్ర ప్రభుత్వం రూ.1,15,531.79 కోట్లు కేటాయించిందని అందులో వ్యవసాయానికి రూ.71,378 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్‌లో 3.2 శాతం మాత్రమే కేటాయింపులు చేశారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నప్పటికీ కేంద్రం బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. వరి, పత్తి, సోయా, పప్పులు, వేరుశనగ లాంటి పంటలు, దిగుబడులు తగ్గిపోతున్నాయని, బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సందర్భంలో 2023-24 సంవత్సరానికి పంట రుణాల కింద రూ. 18 లక్షల కోట్లు రుణాలు ఇస్తామని ప్రకటించారని, గతంలో 16 లక్షలు ప్రకటించిన ఆర్థికమంత్రి ప్రకటన పత్రికలకే పరిమితం అయిందన్నారు. రుణమాఫీ పథకం అమలు కాకపోవడం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని చెప్పారు. మార్కెట్‌లలో కనీస మద్దతు ధరలు అమలు జరగడం లేదన్నారు. ప్రభుత్వ కొనుగోలు సంస్థలు ప్రయివేటు వ్యాపారులతో కుమ్మక్కై రైతులను దివాళా తీయిస్తున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి రూ. 2.25 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తుండగా క్రమంగా తగ్గిస్తూ పోతున్నారన్నారు. పరిస్థితులను గమనించి వ్యవసాయం, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ను పున:పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బీ ప్రసాద్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్‌, రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, ఆంజనేయులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love