నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థుల చావులకు కారణమవుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలను రాష్ట్రంలో మూసేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఇటీవల కాలంలో ఇద్దరు విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. పీర్జాదిగూడ, నార్సింగిలో వారి మరణాలకు ఆ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ధనదాహంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మార్కులు, ర్యాంకులే తప్ప విద్యార్థుల సంక్షేమం వారికి పట్టడం లేదని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వందలకొద్దీ బ్రాంచీలను తెరిచి మాయమాటలతో మోసపూరితంగా విద్యావ్యాపారం కొనసాగిస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. గుర్తింపు లేకుండా సొంత భవనాల్లేకుండా నడుపుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన ఒక్కో విద్యార్థికి రూ.50 లక్షల నష్టపరిహారం ఆ విద్యాసంస్థ చెల్లించాలని కోరారు.
యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి : పీడీఎస్‌యూ
విద్యార్థుల మరణాలకు కారణమైన శ్రీచైతన్య యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, కార్యదర్శి నామాల ఆజాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని పేర్కొన్నారు.
ఆత్మహత్యపై విచారణ జరపాలి : పీడీఎస్‌యూ
శ్రీచైతన్యలో చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై విచారణ జరిపించాలని పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజరుకన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్యలకు నిలయాలుగా మారిన కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు.