– ఫ్యాక్టరీల్లో రెండు దశాబ్దాలుగా 19 శాతం కంటే పెరగని మహిళలు
– కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీల్లో 72 శాతం మంది
– వేతనాల్లోనూ విస్తృత అంతరాలు : ఏఎస్ఐ సమాచారం
దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ వివక్షకు గురవుతున్నారు. విద్యలోనే కాకుండా ఉపాధిలోనూ పురుషులతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయారు. భారత్లోని ఫ్యాక్టరీలలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఇందులో పని చేసే మహిళల సంఖ్య ఐదో వంతు కంటే తక్కువగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీలలో మాత్రం ఇది 72 శాతంతో పర్వాలేదనిపించాయి. ఇటు పనికి దక్కే వేతనాల్లోనూ విస్తృత అంతరాలు కనిపించాయి. పరిశ్రమల వార్షిక సర్వే (ఏఎస్ఐ) సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
న్యూఢిల్లీ : భారత్లోని పరిశ్రమల్లో లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది. ఫ్యాక్టరీలలో పని చేసే మహిళల సంఖ్య పురుషులతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నది. గత రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. పురుషులకు, మహిళలకు అందే వేతనాల్లోనూ ఈ తేడా అధికంగా ఉన్నది. పరిశ్రమల వార్షిక సర్వే ( ఏఎస్ఐ) సమాచారం ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళా సాధికారత అంటూ ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు.. దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా వివక్షతను మాత్రం రూపుమాపలేకపోతున్నారని సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఎస్ఐ సమాచారంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సమాచారం ప్రకారం.. 2019-20 ఏడాదిలో భారత్లోని సంఘటిత ఉత్పాదక పరిశ్రమల్లో 80 లక్షల మంది ఉపాధిని కలిగి ఉన్నారు. వీరిలో మహిళలు 16 లక్షల మంది ( అంటే 19.7 శాతం ) మాత్రమే కావడం గమనార్హం. 1998 నుంచి గత రెండు దశాబ్దాలకు పైగా ఇదే గణాంకాలు కనబడుతున్నాయి.
ఈ 16 లక్షల మందిలో 6.8 లక్షల మంది ( 43 శాతం మంది) ఒక్క తమిళనాడు రాష్ట్రంలోని ఫ్యాక్టరీలలోనే ఉపాధి పొందటం గమనార్హం. భారత్లోని పరిశ్రమలలో గల మొత్తం మహిళా శ్రామిక శక్తిలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్లలోనే 72 శాతం మంది ఉన్నారు. ఉత్పాదక రంగంలో శ్రామిక శక్తి లింగ సమతుల్యతను నమోదు చేసిన రాష్ట్రంగా మణిపూర్ ఉన్నది. ఇక్కడ 50.8 శాతం మంది మహిళలు శ్రామిక శక్తిలో ఉన్నారు. ఆ తర్వాతి రాష్ట్రాల్లో కేరళ ( 45.5 శాతం ), కర్నాటక (41.8 శాతం), తమిళనాడు (40.4 శాతం) లు ఉన్నాయి.