సంస్కృతి

మనదేశం భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం.. శాంతి సామరస్యానికి నిలయం.. సంస్కృతి సౌరభాల వైభవం.. గ్రామీణ కళల సమ్మేళనం.. మరి పండగలు, సంప్రదాయాలు, ఆచారాలు సంస్కృతిలో ఒక భాగం. ఆహారం, అలవాట్లు మనిషి జీవన విధానం. వీటిని అనుసరించడమే కాదు పాటించే పద్ధతులూ వైవిధ్యం. అందుకే పండగలన్నా, పద్ధతులన్నా తగిన ప్రాధాన్యతను కనబరుస్తాం వాస్తవానికి పండగ కొత్తదేం కాదు. కానీ దాన్ని ఆచరించే విధానం గతం కంటే ఘనం. సరిగ్గా గమనిస్తే మనం ప్రకృతిని కొలిస్తే దానికి ప్రతికూలత అయిన వికృతిని కొలిచేవారున్నారు. దేన్నీ తప్పుబట్టలేం. ఎవరి ఇష్టాలు, భావాలు, ఆలోచనలు వారివి. కానీ వాటిని బలవంతంగా సమాజం మీద రుద్దడం స్వేచ్ఛా విరుద్ధం. అలాంటి ప్రస్తుత పరిస్థితి సమస్యకి మూలం. హనుమాన్‌ శోభాయాత్ర నేడు వాడవాడకూ వ్యాపించడం చూస్తున్నాం. గుళ్లు, గోపురాల పేరిట లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్న తీరును ఊహించలేం.గతం నుంచి వర్తమానం అక్కడి నుంచి భవిష్యత్తుకు ప్రయాణం.తరం మారుతుంటే పండగ స్వరూపం మారుతోంది.దీనికి కారణం భక్తి పేరుతో భావజాలవ్యాప్తిని పెంపొందించడం.మనలోని మూస ఆలోచనకు స్వస్తి పలికితేనే దాని నుంచి బయటపడగలం.
భారతీయ సంస్కతికి ప్రతిబింబంగా వెలుగొందుతున్నదే పండగ. వాటిలో ఆనందోత్సాహాలే చూస్తే దాని ప్రత్యేకత చూడలేం.కొత్తబట్టలు, పిండివంటలు, గుమ్మానికి మామిడి తోరణాలు, ఇంటి ముందు ముగ్గులు. ఇవి నాణానికి ఒకవైపు మాత్రమే. ఇవన్నీ కూడా శాస్త్రీయమైన దృక్పథంతో ముడిపడి ఉన్నవే. సంక్రాంతి అంటే సాధారణంగా మూడు రోజుల పండగ. భోగి మొదటి రోజున తెల్లవారకముందే లేచి అందరూ వీధిలో భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని ఏడాది కాలంలో ఉండే చలి పారదోలటానికని అర్థం. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ ఇందులో వేస్తారు. కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించటానికి ఇదో ప్రతీక. రెండో రోజైన సంక్రాంతికి పాలు పొంగించి మిఠాయిలు చేస్తారు. అందరిండ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చకినాలు, పరమాన్నం, పులిహోర, గారెలు వంటకాలు చేస్తారు. బంధువులను పిలుస్తారు. కొత్తబట్టలు ధరించి పండుగను ఆస్వాదిస్తారు. రైతు పండించిన కొత్త బియ్యంతో పండగ చేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. మూడో రోజైన కనుమ వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు.
పండగంటే కులం, మతం, ప్రాంతం, వర్గ విభేదాలన్నింటినీ విస్మరించి చేసుకునేది. కానీ నేడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కులం కుంపట్లలో,మతం మంటల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడం బాధాకరం. దానికి ఆజ్యం పోస్తున్న పరిస్థితి దాపురించడం మరింత శోచనీయం. ఒకప్పుడు పండగంటే సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి. వీటిని నిర్వహించుకోవడానికి కూడా శాస్రీయమైన కారణాలనేకం. కానీ నేడు శ్రీరామనవమి వస్తే ‘జైశ్రీరామ్‌’ అంటూ నినాదాలు. ఇంటా బయట విద్వేషపూరిత ప్రసంగాలు. హనుమాన్‌ జయంతి రోజైతే కిక్కిరిసిన రోడ్లలో ఊరేగింపులు, కాషాయపు జెండాలతో ర్యాలీలు. మరి వీటికే ఎందుకంతా ప్రాచర్యం కల్పిస్తున్నారు. ముస్లింల పండగ బక్రీద్‌, క్రిస్టియన్‌ల పండగ క్రిస్ట్‌మస్‌ వీటిని కూడా అలాగే చూడొచ్చుకదా! కానీ మెజార్టీ హిందూ ప్రజల పండగలుగా కొన్నింటినే చిత్రీకరించడం మూలానా ప్రజల్లో వేర్పాటువాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. పండగంటే భక్తో, నమ్మకమో, విశ్వాసమో ఉంటే పర్వాలేదు.కానీ దీన్నే తమ అస్తిత్వంగా సమాజంలో అంతరాలు పెంచి లబ్ది పొందడం కాస్త ఆలోచించాల్సిన అంశం.
సంక్రాంతి ఒక్క పండగే కాదు. దీపావళి కూడా కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండగ. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. జీవితపు చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండగగా దీన్ని జరుపుకుంటారు. దసరాను కూడా విజయానికి ప్రతీకగా చెప్పుకుంటాం. మట్టివాసన పూతలద్దుకుని మొక్కయి ఎదిగిన మాను వరకు విస్తరించినదే మన సాంస్కృతిక జీవనం. అందులో అణువణువునా ఇమిడి ఉన్నదే అనురాగ, సోయగాల అనుబంధం. దీనికున్న బాధ్యతలోనూ ఇమిడి ఉన్నదే సుస్వరాల కుటుంబం. పండగ రాగానే ఎక్కడో గల్ఫ్‌లో ఉన్నవారు, దూర ప్రాంతాల్లోని ఉద్యోగస్తులు, వలస కార్మికులు, బంధువులు, చిన్ననాటి స్నేహితులందరూ ఒకేచోట కలుసుకునే వేదిక.ఇందులో యోగక్షేమాలు, కష్టాలు, సుఖాలు, అనుభవాలు అన్నీ ఉంటాయి.తల్లిదండ్రుల ఆప్యాయత, అక్కాచెలెళ్ల అనురాగం, అన్నదమ్ముల అనుబంధం అన్నీ తోడై, నీడై నిలుస్తాయి. అలా కుల మతాలకతీతంగా కలిసి చేసుకునే అసలు సిసలైన పండుగే పండగ.

Spread the love