చట్టాల గురించి కనీస అవగాహన దేశంలో ప్రతీ పౌరుడి ప్రాథమిక కర్తవ్యం. మహిళలపై దాడులు, లైంగిక హింసలు, వేధింపులు భౌతికంగా నిర్మూలించడం, అఘాయిత్యాల నిరోధించడానికి ఇండియన్ ఫీనల్ కోడ్‌తో సహా ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ అనునిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట వారి మాన, ప్రాణాలను నిలువరించలేక పోతున్నాయి. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా ఉన్మాదం వంద రెట్లు అధికంగా ఉంది. గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, సతిసహగమన చట్టం, పోక్సో యాక్ట్, నిర్భయ చట్టం, దిశా, అశ్లీలత వ్యతిరేక చట్టాలు ఎన్ని వచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలను, ప్రేమోన్మాదుల దాడులను, యాసిడ్, లైంగిక దాడులను నివారించలేక పోయాయి. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది. రోజు రోజుకూ పేట్రేగి పోతున్న అశ్లీల సినిమాలు, సాహిత్యం, ప్రకటనలు, కట్టడిచేయలేని ప్రభుత్వాలు అనవసర విషయాల పట్ల శ్రద్ధ చూపించడం, కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు తప్ప చేసిందేమిలేదు. దిశ చట్టం అమలులోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఇరవై మంది ఇంజినీరింగ్ చదివే అమ్మాయిలు చంపివేయబడ్డారంటే వార్తలకందని, నిరక్షరాస్యులైన అబలలు ఎందరో? ”పురుషులందరూ స్వేచ్ఛగా జన్మించినట్లయితే, మహిళలందరూ బానిసలుగా ఎలా పుడతారు?” అన్నట్టు మహిళలపై హింస అనేది సామాజిక, ఆర్థిక, అభివృద్ధి, చట్టపరమైన, విద్యా, మానవ హక్కులు, ఆరోగ్యం (శారీరక, మానసిక) సమస్య. ‘నాకు దక్కనిది మరెవ్వరికి దక్కద్దు’ అనే ధోరణి ఇప్పుడు యువతలో బాగా పెరిగిపోతోంది. అదో హీరోయిజంలా ఫీలవుతోంది. శ్రద్ధగా చదువుకొని… లైఫ్‌లో సెటిల్ అవ్వాల్సిన వయసులో చెడుధోరణిలో పయనిస్తోంది. తాము ఏం చేసినా పెద్దగా శిక్షపడేదేమీ ఉండదన్న ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ ధోరణి దేశంలోని యువతలో బాగా కనిపిస్తోంది. దేశంలో పెడదోవపట్టిన యువకుల మైండ్‌లో ఇది బలంగా స్థిరపడిపోయినట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రేమపేరిట అమ్మాయిలపై నిత్యం దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటువంటి వారి పట్ల సంఘటనలు జరిగినప్పుడే సీరియస్‌గా పరిగణిస్తోంది ప్రభుత్వం. ఏదో కొద్ది రోజులు హడావిడి చేసి వదిలేస్తుండడంతో యువతలో ఆ పెడధోరణి నానాటికీ పెరుగుతోంది. తాజాగా ప్రేమోన్మాదానికి మరోయువతి బలైంది. తనకు దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కకూడదన్న ఉన్మాదంతో తెలుగు రాష్ట్రాల్లో హింసా ప్రవృత్తి నానాటికీ పెరిగిపోతోంది. పరువు, ప్రతీకారం అంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని హత్యలకు పాల్పడటం సర్వ సాధారణమైంది. మన దేశం సామాజికంగా ఇంకా వెనుకబడే ఉంది. చదువు, సంపాదన కోసం ఆడపిల్లలను కుటుంబాలకు దూరంగా పంపటం, తమకు నచ్చని ప్రేమ వివాహాలు చేసుకున్న వారిపై హత్యాయత్నాలు చేయటం దారుణం. సమాజంలో కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తుంటే కుల దురహంకార హత్యలు గర్హనీయం. కాలానుగుణంగా మార్పులు సహజం, వీటికి తల్లిదండ్రులు సర్దుకుపోవాలి. తమకిష్టంలేని వారిని వివాహం చేసుకుంటే నచ్చచెప్పటం, వినకపోతే తెగతెంపులు చేసుకొని వదలివేయాలి. కుల దురహంకార హత్యలతో కుటుంబా ల్లో విషాదం తప్ప సాధించేది ఏమీ లేదు. సమాజంలో ఉన్మాదం పెరిగిపోవటానికి ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది. సంక్షేమ పథకాల భారాన్ని మద్యం అమ్మకాల ద్వారా పూడ్చుకోవాలని చూస్తుంటే విచ్చలవిడితనం, నేరప్రవృత్తి పెరుగుతోంది. మానవత్వం మరిచి క్రూరంగా ప్రవర్తించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. ప్రసార మాధ్యమాలు బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అంటూ హింసాత్మక ఘటనలు పదే పదే చూపుతుంటే యువతపై దాని ప్రభావం పడుతుంది. టీవీ ఛానళ్లు స్వీయ నియంత్రణ పాటిస్తే సమాజానికి మేలు చేసినట్టే. పోలీసులు మాత్రం నిందితుల్ని శిక్షించడంలో విఫలమవుతున్నారు. కొన్ని రాజకీయ ప్రాధాన్యం ఏర్పడే కేసుల్లో సీఎం పరిహారం ప్రకటిస్తున్నారు. దాంతో మొత్తం వ్యవహారం సైలెన్స్ అవుతోంది. ప్రభుత్వం తరఫున ఇదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే భవిష్యత్తులో మరిన్ని హత్యలు తప్పవేమో. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేశ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా, చుట్టూ ఉన్న సమాజం మనుషులలో మార్పు రానిది ప్రయోజనంలేదు. ఈ రోజు సామజిక మాధ్యమాల ద్వారా మంచి కంటే చెడును ఎక్కువ ఆకళింపు చేసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడు తున్నారు. ఉపాధి లేకుండా యువతను నిర్వీర్యం చేసిన ఘనత మన పాలకులది. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన వారిలో తొంభైశాతం మందికి ఉద్యోగాలు లేవు, ప్రయివేటు రంగంలో పనిచేసే వారికి అరవై శాతం మందికి జీతాలు లేవు, ఎనభై శాతం ప్రజలు అభద్రతా భావంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఇలాంటి దారుణాలకు కొదవ లేకుండా పోయింది.
సెల్: 9989988912