సమిష్టిగా రాణిస్తేనే..

–  నేడు ఆస్ట్రేలియాతో సెమీస్‌లో ఢ
–  ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌
కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు కఠిన పరీక్షను ఎదుర్కోబోతోంది. గురువారం జరిగే తొలి సెమీస్‌లో భారత మహిళలజట్టు ఐదుసార్లు టైటిల్‌ విజేత, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, భారత్‌జట్లు సెమీస్‌కు చేరాయి. దీంతో గ్రూప్‌-2లో రెండోస్థానంలో ఉన్న భారతజట్టు గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. భారత మహిళలజట్టు తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలంటే ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఓడిస్తేనే ఆ ఛాన్స్‌ దక్కనుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌కు చేరడం ఇది నాల్గోసారి మాత్రమే. 2020లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌.. 2009, 2010లలో సెమీస్‌లో ఓటమిపాలైంది.
దక్షిణాఫ్రికాకు జాక్‌పాట్‌..
గ్రూప్‌-1 ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌పై 10వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా మహిళలజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 113పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా మహిళలజట్టు 17.5ఓవర్లలో 117పరుగులు చేసి ఘన విజయం సాధించింది. దీంతో ఈ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ 4పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ దక్షిణాఫ్రికా(+0.738) రన్‌రేట్‌తో 2వ స్థానంలో, న్యూజిలాండ్‌(+0.138) రన్‌రేట్‌తో 3వ స్థానంలో నిలిచాయి. 24న జరిగే రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది.
ఇంగ్లండ్‌ ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్‌ జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు నమోదుచేసింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. గ్రూప్‌-2 ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా మంగళవారం రాత్రి తొలిగా బ్యాటింగ్‌ దిగిన ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213పరుగులు చేసింది. నాట్‌ స్కీవర్‌ బ్రంట్‌(81), వ్యాట్‌(59) అర్ధ సెంచరీలతో మెరిసారు. ఛేదనలో పాక్‌ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్లు కోల్పోయి 99పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో ఇంగ్లండ్‌ 114పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Spread the love