సర్వ హక్కులూ మాకే!

–  భారత్‌లో హ్యాండ్‌బాల్‌పై హెచ్‌ఏఐ అధ్యక్షుడు జగన్‌
–  అంతర్జాతీయ, ఆసియా సమాఖ్యల గుర్తింపు
–  త్వరలోనే ఐఓఏ నుంచీ సానుకూల స్పందన
జాతీయ క్రీడా సంఘాల్లో రాజకీయాలు, కుమ్ములాటలు నిత్యకృత్యం. అందుకు జాతీయ హ్యాండ్‌బాల్‌ అతీతం కాదు. కానీ, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య, ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్యల గుర్తింపు దక్కినా.. ఇక్కడి రాజకీయాలతో భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) మరో సంఘాన్ని ఎన్‌ఎస్‌ఎఫ్‌గా గుర్తించింది. అంతర్జాతీయ సమాఖ్య గుర్తింపు పొందిన సంఘం కాకుండా మరో సమాఖ్య హ్యాండ్‌బాల్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తే.. భారత్‌లో హ్యాండ్‌బాల్‌పై నిషేధం విధిస్తామని ఇటీవల అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య తీవ్రంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత హ్యాండ్‌బాల్‌లో చోటుచేసుకున్న రాజకీయాలు, కుట్రలను భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (ప్రపంచ, ఆసియా గుర్తింపు పొందినది) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌
జాతీయ హ్యాండ్‌బాల్‌లో గత కొంతకాలంగా చోటుచేసుకున్న సందిగ్థత, రాజకీయాలు, కుట్రలకు శాశ్వతంగా ముగింపు పలికామని భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య, ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్యలు హెచ్‌ఏఐకు భారత్‌లో జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపు అందించాయని, ఇక్కడ హ్యాండ్‌బాల్‌ నిర్వహణ, అభివృద్దిపై సర్వ హక్కులూ హెచ్‌ఏఐ సొంతమని జగన్‌మోహన్‌ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు అంతర్జాతీయ, ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్యలు భారత ఒలింపిక్‌ సంఘానికి పంపిన లేఖల ప్రతులను చూపించారు. హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఏఐ) కాకుండా.. మరే ఇతర సంఘం హ్యాండ్‌బాల్‌లో జోక్యం చేసుకున్నా తక్షణమే భారత్‌లో హ్యాండ్‌బాల్‌పై నిషేధం విధిస్తామని అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఇటీవల ఐఓఏకు రాసిన లేఖను సైతం జగన్‌మోహన్‌ రావు విలేకరుల సమావేశంలో బయటపెట్టారు.
మూడేండ్లలో రెండు టైటిళ్లు
‘ ఒలింపిక్‌ క్రీడల్లో ఓ జాతీయ సంఘానికి అధ్యక్షత వహించటం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లతో కూడిన వ్యవహారం. అనతికాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఎదిగాను. ఈ ప్రస్థానంలో జాతీయ హ్యాండ్‌బాల్‌లో పలు విజయాలు సొంతం చేసుకున్నాం. ఎటువంటి సిఫారసులకు తలొగ్గకుండా ఉత్తమ జట్లను ఎంపిక చేశాం. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆధునాతన అకాడమీలో శిక్షణ అందించాం. ఫలితంగా, 2022 ఆసియా జూనియర్‌ మహిళల యూత్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌తో పాటు అదే ఏడాది ఆసియా మహిళల యూత్‌ బీచ్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాం. 2023 ఆసియా మహిళల ప్రెసిడెంట్‌ కప్‌ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించాం. 2023 ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు అర్హత సాధించింది. అధ్యక్షుడిగా మూడేండ్ల కాలంలో భారత హ్యాండ్‌బాల్‌ మునుపెన్నడూ చూడని విజయాలను సాధించి చూపించాను’ అని జగన్‌మోహన్‌ రావు తెలిపారు.
ఇక తగ్గేది లేదు
‘ అంతర్జాతీయ స్థాయిలో భారత హ్యాండ్‌బాల్‌ విజయాలు కొందరికి రుచించలేదు. అక్రమాలు, అవినీతికి అవకాశం ఇవ్వటం లేదని కుట్రలకు తెరతీశారు. దక్షిణాది, ఓ తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి జాతీయ సమాఖ్య అధ్యక్ష పగ్గాలు చేపట్టడం వారికి నచ్చలేదు. అధ్యక్ష పీఠం నుంచి తొలగించేందుకు కుట్ర చేశారు. ఇంత చేసినా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. దేశంలో హ్యాండ్‌బాల్‌ కార్యకలాపాలను హెచ్‌ఏఐ మాత్రమే నిర్వహించేలా భారత ఒలింపిక్‌ సంఘానికి అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య లేఖ రాసింది. అడ్డంకులు సృష్టిస్తున్న సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. దేశంలో ఒలింపిక్‌ క్రీడ హ్యాండ్‌బాల్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు హెచ్‌ఏఐతో కలిసి పని చేయాలి. ఇక, హ్యాండ్‌బాల్‌ అభివృద్దిలో ఎక్కడా తగ్గేది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి హ్యాండ్‌బాల్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని’ జగన్‌ వెల్లడించారు.
రెండు మెగా టోర్నీలు
‘ఈ ఏడాది రెండు మెగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ తొలి సీజన్‌ పోటీలను జూన్‌లో నిర్వహించనున్నాం. జూన్‌ 8 నుంచి 25 వరకు ఈ పోటీలు జరుగుతాయి. జులైలో ఆసియా మహిళల యూత్‌ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాం. న్యూఢిల్లీ వేదికగా జులై 15 నుంచి 24 వరకు ఈ టోర్నీ ఉంటుంది. జపాన్‌, చైనా, చైనీస్‌ తైపీ, ఇరాన్‌ సహా పది దేశాలు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. గత ఏడాది హైదరాబాద్‌ వేదికగా ఆసియా మెన్స్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించటంతో ఆసియా యూత్‌ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కాయని’ అని జగన్‌ అన్నారు.
మిషన్‌ ఒలింపిక్స్‌
‘2028 ఒలింపిక్స్‌లో భారత హ్యాండ్‌బాల్‌ జట్టు పోటీపడాలనేది నా స్వప్నం. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాలికబద్దంగా ముందు కెళ్తున్నాం. మిషన్‌ ఒలింపిక్స్‌ను సాకారం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతిభాన్వేషణతో మేటి క్రీడాకారులను వెలికితీసి అత్యుత్తమ శిక్షణ అందించనున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు ఐఓఏ, సారు సహకారం అవసరమని’ జగన్‌మోహన్‌ రావు పేర్కొన్నారు.
ఇతరులకు అనుమతి లేదు
భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ)కి మాత్రమే ఐహెచ్‌ఎఫ్‌, ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ గుర్తింపు ఉన్నాయి. ఐహెచ్‌ఎఫ్‌, ఏహెచ్‌ఎఫ్‌ పేరు, లోగో ఇతరులు వినియోగించేందుకు అనుమతి లేదు. ఇతర సంఘాలు లోగోలను వినియోగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. హెచ్‌ఏఐకి మాత్రమే భారత్‌లో హ్యాండ్‌బాల్‌పై హక్కులు ఉన్నాయని ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెవరేషన్‌ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ షఫిఖ్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
హెచ్‌ఏఐకే మా గుర్తింపు
భారత్‌లో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఏఐ)కి మాత్రమే అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఐహెచ్‌ఎఫ్‌) గుర్తింపు ఉంది. మరే ఇతర సంఘం హ్యాండ్‌బాల్‌లో జోక్యం చేసుకోరాదు. హ్యాండ్‌బాల్‌ ఫెవరేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఎఫ్‌ఐ) హ్యాండ్‌బాల్‌ నిర్వహణలో కొనసాగకుండా కట్టడి చేయండి. హెచ్‌ఎఫ్‌ఐను అదుపు చేయలేని పరిస్థితులు ఉంటే అదే విషయాన్ని మాకు తెలియజేయండి. ఆ పరిస్థితుల్లో భారత్‌లో హ్యాండ్‌బాల్‌ నిషేధం విధించేందుకు వెనుకాడమని ఐహెచ్‌ఎఫ్‌ హెచ్చరించింది.

Spread the love