సారాయే కాదు.. సీసా కూడా పాతదే…

    ‘కొత్త సీసాలో పాత సారా…’ బడ్జెట్ల సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షాలు చేసే కామెంట్‌ ఇది. కానీ బీఆర్‌ఎస్‌ సర్కారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి సారిగా ప్రతిపాదించిన పద్దులో… అందునా విత్త మంత్రి హరీశ్‌రావు నాలుగోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ‘సారాయే కాదు… సీసా కూడా పాతదే…’ అయ్యింది. 89 పేజీల ప్రసంగ పాఠంలో అత్యధిక భాగం పాత విషయాలే. గత బడ్జెట్లతోపాటు అనేక వేదికల మీది చెప్పిన అంశాలే మరోసారి నొక్కి వక్కాణించటం గమనార్హం. గతంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ తదితరాంశాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేస్తారని భావించిన వారి ఆశలు… ఈ పద్దుతో అడియాశలయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్పులు, ఆరోగ్యశ్రీ తదితరాంశా లకు కూడా నామమాత్రంగా నిధులను విదిలించారు తప్ప వాటి అవసరాన్ని గుర్తించలేదు. ఇక రైతు రుణమాఫీ గోస ఈ బడ్జెట్‌లోనూ తీరలేదు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అన్నదాతలకు చేయూతనిస్తున్నా… రుణమాఫీ చేయకపోవటంతో వారు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. లక్ష రూపాయల రుణానికి ఏడాదికి రూ.14వేల మేర వడ్డీ అవుతోందంటూ బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఒక ఎకరా ఉన్న రైతుకు లక్ష రూపాయల రుణం ఉంటే… ఆయనకు రైతు బంధు కింద రెండు పంటలకు కలిపి వచ్చే ఆర్థిక సాయం (ఒక పంటకు రూ.5 వేల చొప్పున, రెండు పంటలకు కలిపి రూ.పది వేలు) కంటే వడ్డీయే రూ.నాలుగు వేలు అధికంగా ఉంటుదన్నమాట. ఈ క్రమంలో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అన్నదాతలను కష్టాల కడలి నుంచి గట్టెక్కించలేక పోతున్నాయి. అయినా సర్కారు ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత నివ్వలేదు. రుణమాఫీ కోసం సుమారు రూ.19 వేల కోట్లకు పైగా అవసరమవుతుండగా… బడ్జెట్‌లో కేవలం రూ.6,385 కోట్లే కేటాయించటం శోచనీయం. ప్రజలకు దీర్ఘకాలంలో ఉపయోగ పడే ఇలాంటి వ్యవస్థీకృత అంశాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించకపోతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమనేది ఇప్పుడు జవాబే లేని శేష ప్రశ్నగా మిగిలింది.
మరోవైపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైతే అతి అంచనాలకు పోయారో… ఇప్పుడు కూడా అదే రీతిన ‘రాని ఆదాయాన్ని…’ వస్తుందంటూ పద్దులో పేర్కొనటం గమనార్హం. భూముల అమ్మకాల ద్వారా రూ.13 వేల కోట్లను ఆర్జిస్తామంటూ ప్రభుత్వం పద్దులో ప్రకటించింది. గత ఎనిమిదేండ్ల అనుభవం ప్రకారం… ఈ రూపంలో వచ్చింది వందల కోట్లల్లో కూడా లేదు. ఇప్పుడు మరోసారి పద్దులో అదే పాట పాడటంతో ఆర్థిక నిపుణులు విస్తుబోతున్నారు. కేంద్రం నుంచి మనకు న్యాయంగా, వాటా ప్రకారం రావాల్సిన నిధులు, గ్రాంట్లే రావటం లేదు. అలాంటిది 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్‌ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ)కు రూ.5 వేల కోట్లు వస్తాయంటూ అంచనా వేసుకోవటం అత్యాశే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి విభజన అంశాల ఆధారంగా రూ.17 వేల కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చెప్పటం కూడా అతి అంచనాయే అవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇవి మొత్తం కలిపి రూ.54 వేల కోట్లు అవుతున్నాయి. అంటే మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌లో ఇప్పటికే రాని ఆదాయం రూ.54 వేల కోట్లుగా తేలిపోయిందన్నమాట. అలాంటప్పుడు ఈ లోటనేది పలు రంగాలు, శాఖలపై ప్రభావం చూపుతుం దనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఎన్నికల సంవత్సరం కాబట్టి… ఏయే రంగాలకు కోతలు పెడతారనేది వేచి చూడాలి. మొత్తం మీద హరీశ్‌రావు వరసగా నాలుగోసారి ప్రతిపాదించిన పద్దులోనూ అతి అంచనా లేసుకుంటూ.. ప్రజల్లో ఆశలు రేపుతూ ముందుకు సాగారే తప్ప వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదనడం సత్యదూరమేమీ కాదు. అలాంటప్పుడు దీర్ఘకాలంలో ప్రజల్లో బీఆర్‌ఎస్‌ సర్కారు విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదముంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొంది స్తున్నామంటూ ఆ పార్టీ అధినేత చెబుతున్న క్రమంలో వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ను సవరించి… ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులను కేటాయించటం ద్వారా తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తం గానూ నమ్మకాన్ని ప్రోది చేసుకుంటారని ఆశిద్దాం.

Spread the love