నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిత్యం బొగ్గుగనుల్లో పనిచేస్తూ, సంపద సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వయంగా వారికి అవసరమైన సంక్షేమ చర్యలను సమీక్షించి, కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేసింది. దానిలో ప్రభుత్వం కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సింగరేణి ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏండ్లకు పెంచిందనీ, ప్రమాదవశాత్తూ మరణిస్తే, కంపెనీ ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్‌ను పది రెట్లు పెంచి ఇస్తున్నదనీ తెలిపారు. గతంలో మ్యాచింగ్ గ్రాంట్ రూ.లక్ష ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.10 లక్షలకు పెంచినట్టు వివరించారు. డిపెండెంట్ ఎంప్లారుమెంట్, ఎంఎంసీకి బదులు గతంలో రూ.5 లక్షలు చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.25 లక్షలకు పెంచినట్టు తెలిపారు. కార్మికుల సొంతింటి నిర్మాణానికి రూ.10 లక్షల రుణం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్మికులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు, కాలనీల్లోని క్వార్టర్స్‌లో ఏసీ సౌకర్యం, ఐఐటీ, ఐఐఎం చదివే కార్మికుల పిల్లల ఫీజులను కూడా కంపెనీనే చెల్లిస్తున్నదని వివరించారు. అలాగే మెడికల్ అన్‌ఫిట్ ద్వారా ఉద్యోగం వద్దను కునే వారికి ఏకమొత్తంగా రూ.25 లక్షలు, లేదా నెలకు రూ.26,293 చెల్లించే పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. మహిళా ఉద్యోగులకు 12 వారాల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచి, చైల్డ్ కేర్ లీవులు ఇస్తున్నామన్నారు. కరెంటు బిల్లుల్ని రద్దు చేస్తూ, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వైద్య సదుపాయాలు కల్పిస్తు న్నట్టు పేర్కొన్నారు. 9,444 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యుల రైజ్ చేశామని తెలిపారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించామనీ, రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేశామన్నారు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటాను బోనస్ రూపంలో ఏటా పెంచి ఇస్తున్నామని తెలిపారు. వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నదనీ, భవిష్యత్‌లో మరిన్ని అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలూ చేస్తున్నట్టు వివరించారు.