సిరీస్‌ పట్టేస్తారా?

– శ్రీలంకతో రెండో టీ20 నేడు
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
            కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించిన టీమ్‌ ఇండియా.. స్వదేశీ సీజన్‌ను సిరీస్‌ విజయంతో మొదలెట్టేందుకు సిద్ధమవుతోంది. ఉత్కంఠగా సాగిన వాంఖడె టీ20లో భారత్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందినా.. లంకేయులు చివరి బంతి వరకు పోటీనిచ్చారు. నేడు శ్రీలంకపై తిరుగులేని విజయంతో సిరీస్‌ కైవసం చేసుకోవాలని యువ భారత్‌ ఉవ్విళ్లూరుతోంది. భారత్‌, శ్రీలంక రెండో టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-పుణె
యువ జట్టు పొట్టి సిరీస్‌పై కన్నేసింది. ముంబయిలో అంచనాలను అందుకునే ప్రదర్శన చేయకపోయినా.. నాణ్యమైన శ్రీలంక జట్టుపై మెరుగ్గానే రాణించింది. ఫలితంపై ఆలోచన లేకుండా, ఒత్తిడి సమయాల్లో రాటుదేలే అనుభవానికే జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యత ఇస్తోంది. వాంఖడె మ్యాచ్‌లో చివరి ఓవర్‌ అక్షర్‌ పటేల్‌కు ఇవ్వటంతో పాండ్య ఈ విషయాన్ని చాటాడు. నేడు పుణెలో శ్రీలంకపై సాధికారిక విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పాండ్యసేన భావిస్తోంది. చివరి వరకు పోరాడినా పరాజయం పాలైన శ్రీలంక నేడు సిరీస్‌ సమమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పుణెలో మరో టీ20 థ్రిల్లర్‌ ఖాయం!.
బ్యాటింగ్‌పైనే ఫోకస్‌ :
యువ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ సైతం సీనియర్ల తరహాలోనే తేలిపోయింది!. టాప్‌ ఆర్డర్‌లో ఎదురుదాడి మంత్ర ఫలించలేదు. వరుస వికెట్లు మిడిల్‌ ఆర్డర్‌పై ఎనలేని ఒత్తిడికి కారణమైంది. లోయర్‌ ఆర్డర్‌లో దీపక్‌, అక్షర్‌ రాణించటంతో భారత్‌ మంచి స్కోరు సాధించింది. తొలి ఓవర్లో తుఫాన్‌ రేపిన ఇషాన్‌ తర్వాత నెమ్మదించాడు. గిల్‌ సైతం అరంగేట్రంలో నిరాశపరిచాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ బెంచ్‌పై అవకాశం కోసం చూస్తున్నాడు. స్వల్ప స్కోర్లతో గిల్‌ తుది జట్టులో నిలువలేదు. నేడు ఇషాన్‌ తోడుగా గిల్‌ ధనాధన్‌కు చూడనున్నాడు. స్టార్‌ బ్యాటర్‌ సూర్య వాంఖడెలో నిరాశపరిచినా.. పుణెలో అతడు ప్రతాపం చూపితే భారీ స్కోరు ఖాయం. సంజు శాంసన్‌ నిలకడగా సులువుగా వికెట్‌ పారేసుకుంటున్నాడు. హార్దిక్‌ పాండ్య, శాంసన్‌, దీపక్‌ హుడాలు మెరిస్తే భారత బ్యాటింగ్‌ కష్టాలు తీరినట్టే. ఇక బౌలింగ్‌ విభాగంలో భారత్‌ డెత్‌ ఓవర్ల సమస్యను అధిగమించలేదు. ఏకపక్షమనుకున్న మ్యాచ్‌లో 19వ ఓవర్లో హర్షల్‌ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీసింది. డెత్‌ ఓవర్లలో ఈ బలహీనతను అధిగమించాలి. అర్షదీప్‌ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ సైతం వాషింగ్టన్‌ సుందర్‌ బెర్త్‌ కోల్పోయే పరిస్థితి నెలకొంది.
పుంజుకోవాలని..! : సిరీస్‌ను సమం చేయాలనే సంకల్పంతో శ్రీలంక బరిలోకి దిగుతోంది. టాప్‌ ఆర్డర్‌లో బ్యాటర్లు విఫలమైనా మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ మెరుపులతో శ్రీలంక చివరి బంతి వరకు పోరాడింది. బంతితో భారత్‌పై గొప్ప ప్రదర్శన చేసిన లంకేయులు.. బ్యాట్‌తో ఆ స్థాయిలో మెరవలేదు. నిశాంక, అసలంక, భానుక, ధనంజయ డిసిల్వ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. వానిందు హసరంగ మరోసారి బంతితో, బ్యాట్‌తో ఆ జట్టుకు కీలకం కానున్నాడు. స్పిన్‌కు సహకరించే పుణె పిచ్‌పై హసరంగ, మహీశ్‌లు భారత్‌కు సవాల్‌ విసరనున్నారు.
పిచ్‌, వాతావరణం : పుణె పిచ్‌ నల్లమట్టితో తయారు చేశారు. సహజ సిద్ధంగా బ్యాటింగ్‌కు, నాణ్యమైన స్పిన్‌కు అనుకూలం. భారత్‌ ఇక్కడ మూడు టీ20లు ఆడింది. ఐపీఎల్‌ మ్యాచుల ఫలితాలనూ పరిశీలిస్తే, తొలుత బౌలింగ్‌ చేసిన జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. మ్యాచ్‌ రోజు వాతావరణ ఉక్కపోతగా ఉండనుంది. ఎటువంటి వర్షం సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : కిషన్‌ (వికెట్‌ కీపర్‌), గిల్‌, సూర్య, సంజు శాంసన్‌, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, శివం మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, యుజ్వెంద్ర చాహల్‌/వాషింగ్టన్‌ సుందర్‌.
శ్రీలంక : నిశాంక, మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), డిసిల్వ, అసలంక, రాజపక్స, శనక, హసరంగ, కరుణరత్నె, మహీశ్‌, రజిత, మధుశంక.

Spread the love