సీబీఐ మారాలి : సుప్రీంకోర్టు

హైదరాబాద్: ప్రపంచం మారిందని, సీబీఐ కూడా మారాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. వ్యక్తిగత డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ సాధనాలను.. అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించుకొనేలా దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ను ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా ధర్మాసనం విచారించింది. గోప్యత అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థల మాన్యువల్‌లు అప్‌డేట్‌ అవుతున్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ స్పందిస్తూ.. ప్రపంచం మారిపోయిందని, సీబీఐ కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు.  తాను సీబీఐ మాన్యువల్‌ని చూశానని, దాన్ని అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ఓకా పేర్కొన్నారు. దర్యాప్తు సమయంలో అనుసరించాల్సిన విధానాన్ని సీబీఐ మాన్యువల్‌లో పేర్కొంది. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర సమస్య అయినందున, చట్టం అమలు.. నేరాల దర్యాప్తుకు సంబంధించిన అంశంపై అన్ని వర్గాల నుంచి సూచనలు, అభ్యరంతరాలు తీసుకోవడం సముచితమని గతంలో ఈ అంశంపై చేసిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. పిటిషనర్ల భయాందోళనలకు సంబంధించినంతవరకు, సీబీఐ మాన్యువల్ 2020ని అనుసరించడం ద్వారా చాలా వాటిని తొలగించవచ్చని అఫిడవిట్‌లో పేర్కొంది. మాన్యువల్ రీడ్రాఫ్ట్ చేసి ప్రకటించినట్లు పేర్కొంది. ఈ అంశంపై ఫిబ్రవరి 27న మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది.

Spread the love