‘సుకన్య’ ఖాతాల ఓపెన్‌లో పోస్టల్‌శాఖ రికార్డు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ఓపెనింగ్‌లో తెలంగాణ సర్కిల్‌ పోస్టల్‌శాఖ రికార్డు సాధించింది. ఈనెల 9 నుంచి 11 వరకు రాష్ట్రంలోని 6,208 పోస్టాఫీసుల్లో నిర్వహించిన సుకన్య మహామేళా కార్యక్రమంలో 34,384 ఖాతాలు ఓపెన్‌ చేసినట్టు హైదరాబాద్‌ రీజియన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎమ్‌ సంతోష్‌కుమార్‌ నరహరి తెలిపారు. ఈ మేళాలో 28,970 సుకన్య ఖాతాలు ఓపెన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, కానీ అంతకంటే ఎక్కువగా 118.69 శాతం ఖాతాలను ప్రారంభించగలిగామన్నారు. 2015 జనవరి నుంచి 2023 జనవరి వరకు రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల్లో మొత్తంగా 8,62,776 సుకన్య ఖాతాలు ఓపెన్‌ చేశామన్నారు. ప్రజల నుంచి ఈ స్కీంకు విశేష ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. 2015లో ఈ ఖాతాలు ఓపెన్‌ చేసిన అనేకమంది ఇప్పుడు పాక్షిక విత్‌డ్రాయల్స్‌ ద్వారా లబ్దిపొందుతున్నారని వివరించారు. అత్యధికంగా ఖమ్మం డివిజన్‌లో 4,266 ఖాతాలు, సికింద్రాబాద్‌ డివిజన్‌లో 3,858, కరీంనగర్‌ డివిజన్‌లో 3,503, హైదరాబాద్‌ సౌత్‌ డివిజన్‌లో 2,629, నల్గొండ డివిజన్‌లో 2,239 ఖాతాలు ఓపెన్‌ చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ స్కీంలో 11 లక్షల ఖాతాలు ఉన్నాయని చెప్పారు. 0-10 సంవత్సరాలలోపు ఆడపిల్లల పేరుపై రూ.250తో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షలు డిపాజిట్‌ చేయవచ్చు. పాక్షిక విత్‌డ్రాయల్‌ అవకాశం ఉంది. బాలికలకు 18 ఏండ్లు వచ్చే వరకు వారి ఉన్నత విద్యకు ఈ సొమ్ము ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Spread the love