సుఖం వస్తే మొకం కడుగ తీరదట

         కొందరికి సుఖం కల్సి వస్తది. సుఖ పడటం ఇష్టం. సుఖంగా జీవించడం అంటే శ్రమకు దూరం అయి నీడపట్టున ఉండుడు అని అర్థం. ఇంకో అర్థంల ఎప్పుడూ సుఖం కోరుకునే వాడంటే లేజీ మనిషనట్టే. అయితే అందరు శ్రమించనిదే కడుపులకు బువ్వరాదు. కాని కొందరికి శ్రమ లేకున్నా, సంపద వచ్చేస్తనే ఉంటది. సుఖం బాగా ఉన్నవాల్లు బాగా పొద్దు ఎక్కినంక లేస్తరు. అంటే తెల్లారి 9 తర్వాత మెల్లగ లేస్తరు. లెవ్వంగనే వీళ్ళను చాయ టిఫిన్‌ అందిస్తనే ఉండాలె. వీళ్ళను చూసి యాష్ట వచ్చిన ఇంటివాళ్ళు వీనికి ‘సుఖం వస్తే మొకం కడుగ తీరది’ అనే సామెత వాడుతరు. పొద్దు ఎక్కినంక లేచిన ఆ మనిసి వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని ముఖ ప్రక్షాళన చేసుకుంటరా అంటే అదీ లేదు. ఉత్తగనే అటూ ఇటూ తిరిగి కడుగమనంగ కడుగమనంగ మొకం కడుక్కుంటరు. పని చేసుకొని బతికే వాళ్ళు ఇట్ల కాదు, తెల్లరక ముందే లేచి తయారై ఏదో పనికి పరుగెడుతరు. ఇట్లాంటి టైపు వాళ్ళు పల్లెల్లో అక్కడక్కడా కన్పిస్తరు.
కడప లోపల ఉన్న సుఖం కాశీకి పోయినా దొరకది
పూర్వకాలంలో ప్రయాణాలంటే మస్తు కష్టం ఉండేది. ఇప్పుడైతే రైళ్లు ఉన్నయి కానీ తిరగడం అంటే నడిచి వెళ్ళడమే. చుట్టాల ఇండ్లకు వెళ్ళాలన్నా, పుణ్యక్షేత్రాలు తిరగాలన్నా నడవటం లేదా బండ్ల మీద వెళ్ళి రావడమే. ఆ ప్రయాణంలో కష్టాలు అనేకం. ఎండ వాన దూప ఆకలి రాత్రి అయితే పండు కోవడానికి వసతి లేక పోవడం ఉండేది. ప్రయాణం చేస్తున్న వారికి అవస్తలు అన్నీ ఇన్నీ కావు. అప్పుడు గుర్తుకు వచ్చే సామెత ‘కడప లోపల ఉన్న సుఖం కాశీకి పోయినా దొరకది’. కానీ యాత్ర చేయడం అంటే చాలా దూరం గొప్ప యాత్ర అది. ఆ కాలంలో కాశీకి పోయి వచ్చిన వాళ్ళను ఊర్లల్ల ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్ళేవారు. వీళ్ళు కాశీని చూసిండ్రు అంటే ఎంతో పుణ్యాత్ములు, వీళ్ళను ముట్టుకొని మనమూ పునీతులం కావాలనే ఆలోచనలు పవిత్రతను ఆపాదించేవాళ్ళు. కాశీ అంటే ప్రాముఖ్యత అంత గొప్ప ప్రాంతంను సందర్శించడం కన్నా, కడపలోపల ఉండటం అంటే ఎటూ తిరగకపోవడం అన్నట్టు ఇంటిలోని సుఖం ఇంతింతకాదయా అన్నట్లు ఈ సామెత.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love