సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 20,696 పోస్టులు ఖాళీ

– కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌
న్యూఢిల్లీ: దేశంలోని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 20,696 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 45 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 2022 డిసెంబర్‌ 1 నాటికి 6,180 బోధన పోస్టులు, 2022 జూలై 1 నాటికి 14,516 బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 16 బోధన, 9 బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గిరిజన యూనివర్సిటీలో 18 బోధన, 12 బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 162 బోధన, 823 బోధనేతర సిబ్బంది పోస్టులు, మౌలనా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీలో 87 బోధన, 60 బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని సెంట్రల్‌ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీల్లో 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు నాలుగేళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని తెలిపారు.
దేశంలో 1,89,302 ఉపాధ్యాయులు తగ్గుదల,  20,021 పాఠశాలలు మూసివేత
దేశంలో 1,89,302 ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయనీ, 20,021 పాఠ శాలలు మూసివేతకు గురయ్యాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.ఆర్‌ సురేష్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Spread the love