స్నేహం విషయంలో మగవారికి ఉండేంత అవకాశం ఆడవారికి వుండదు. ఎప్పుడో చిన్నప్పుడు బడిలో చదువుకున్న నేస్తాలు కూడా జీవితాంతం కలిసి ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆడవారి విషయం అలా కాదు. పెండ్లి తర్వాతో, పిల్లల తర్వాతో వారి వ్యక్తిగత జీవితాలన్నీ భర్తకీ, పిల్లలకీ అంకితం అయిపోతుంటాయి. ఇక పుట్టింటిని వదిలి భర్తతో పాటుగా ఊరు కూడా మారిపోతే చెప్పనే అక్కర్లేదు. దాంతో అటు మానసికంగా, భౌతికంగా వారి నేస్తాలందరికీ దూరం అయిపోతుంటారు. మరి ఆ స్నేహాలను నిలుపుకొనేందుకు మార్గమే లేదా అంటే.. ఉందంటున్నా నిపుణులు…
ఒక రికార్డుని ఉంచుకోండి: మీ నేస్తాలందరి పేర్లనీ, వారి చిరునామాలనీ, ఫోన్ నెంబర్లతో సహా ఒక చోట నమోదు చేసుకోండి. ఇవే కాకుండా వారి పుట్టిన రోజులూ, పెండ్లి రోజులూ రాసుకోండి. ఇలా మీ నేస్తాల జాబితా అంటూ ఉంటే… ఎప్పటికైనా వారిని తిరిగి పలకరించే అవకాశం ఉంటుంది. ఈ జాబితాని వీలైనంత పెంచుకునే ప్రయత్నం చేయండి. వారిలో కొందరితోనైనా మీ స్నేహాన్ని నిలుపుకొనే అవకాశం ఉంటుంది.
పలకరిస్తూ ఉండండి: జీవితంలో మనం ఎంతో సమయాన్ని వృథా చేస్తూ ఉంటాము. పైగా టీవీ, వార్తాపత్రికలు, సినిమాలు… అంటూ ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. కానీ మనకి ఇష్టమైన చిన్ననాటి నేస్తాలను పలకరించేందుకు బద్ధకిస్తాం. దాంతో కాలంతో పాటుగా విలువైన స్నేహాలు కూడా మరుగునపడిపోతుంటాయి. అందుకే వీలైనప్పుడల్లా వారిని ఫోన్లో పలకరిస్తూ, వారి యోగక్షేమాలను కనుక్కొంటూ ఉండండి. వారి సంసారం ఎలా సాగుతోందో పరామర్శించండి. వీలైతే వారి పుట్టినరోజుల వంటి సందర్భాలలో మీ శుభాకాంక్షలను తెలియచేయండి.
అపార్థాలు వద్దు: పెండ్లయిన తర్వాత అందరి పరిస్థితీ ఒకేలా ఉండకపోవచ్చు. ఫోన్ చేసే విషయంలోనూ, మాట్లాడే విషయంలోనూ వారి తీరు మారిపోయి ఉండవచ్చు. అయితే అది కేవలం వారిలో వచ్చిన మార్పుగా భావించి అపార్థం చేసుకోవద్దు. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనుకుని ఊరుకోండి. మీ పరామర్శలు వారిని నిజంగానే ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే వెనక్కి తగ్గండి.
గెట్ టు గెదర్: మగవారు కలుసుకోవాలంటే బోలెడు అవకాశాలు ఉంటాయి. కానీ ఇంటిపట్టునే ఉండే గృహిణులు కలుసుకోవాలంటే ఏమంత సులభం కాదు. అందుకని వీలైతే ఆరునెలలకో ఏడాదికో ఒక్కసారైనా మీ ఊళ్లో ఉండే చిన్ననాటి నేస్తాలంతా కలుసుకునేలా ఒకొక్కరి ఇంట్లో గెట్ టు గెదర్ ఏర్పాటు అయ్యేందుకు చొరవ చూపండి.
అండగా నిలబడండి: అవసరమైనప్పుడు అక్కరకు రాని స్నేహం ఎందుకూ కొరగాదని తెలిసిందే. అందుకే మీ నేస్తాలలో ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది తలెత్తినప్పుడు మీ వంతుగా మీరు ఏం చేయగలరో ఆలోచించండి. డబ్బు సాయం చేయకపోవచ్చు, హామీ పత్రాల మీద సంతకాలు పెట్టలేకపోవచ్చు. కానీ వారు కష్టాలను ఓర్చుకోవడానికి మీ తోడు ఉంటే చాలు. వారి కన్నీటిని తుడవడానికి మీ ఓదార్పు ఉంటే చాలు.
కుటుంబంతో పంచుకోండి: మీ నేస్తాల గురించీ, వారితో మీకు ఉన్న అనుబంధం గురించీ మీ కుటుంబంతో పంచుకోండి. మీ జీవితంలో స్నేహితులకు కూడా తగినంత ప్రాధాన్యం ఇవ్వాలనుకున్న అభిలాషని వారు గుర్తించేలా చేయండి. మీ స్నేహితులను కలుసుకునేందుకు వెళ్లేటప్పుడు ఎప్పుడన్నా మీ కుటుంబాన్నో, లేదంటే కనీసం మీ పిల్లలనో వెంట తీసుకుని వెళ్లండి. వాళ్లకి కూడా మీ స్నేహితుల అభిమానాన్ని అందించండి.