స్నేహితున్ని చంపి గుండె తీసి..

–  దారుణంగా హత్య చేసిన యువకుడు
–  ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు..
–  పోలీసుల ఎదుట నిందితుని లొంగుబాటు
–  ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించడమే కారణం..!
– ఘటన స్థలానికి డీసీపీ, ఏసీపీ
నవతెలంగాణ-హైదరాబాద్
తాను ప్రేమించిన అమ్మాయితో నవీన్‌ చనువుగా ఉండటాన్ని హరి హర కృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. దాంతో నవీన్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 17వ తేదీన ఉదయం గెట్‌ టూ గెదర్‌ చేసుకుందామని నవీన్‌ను హరిహరకృష్ణ హైదరాబాద్‌లోని తన స్నేహితుడి రూమ్‌కి తీసుకెళ్లాడు. పార్టీ అనంతరం యువతి విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ విషయాన్ని నవీన్‌ వెంటనే తన తండ్రి శంకరయ్యకు ఫోన్‌ చేసి తెలిపాడు. దీంతో భయాందోళన చెందిన శంకరయ్య హరితో ఫోన్లో మాట్లాడి రాజీ కుదర్చడంతో ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. అయితే అప్పటి నుంచి నాలుగు రోజులైనా నవీన్‌ కాలేజీకి కానీ, ఇంటికి కానీ రాలేదు. ఆందోళనతో నవీన్‌ తండ్రి శంకరయ్య నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నార్కట్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హరి స్నేహితులను, ఎంజీయూలోని విద్యార్థులను ప్రశ్నించారు. ఈనెల 22 సాయంత్రం నుంచి హరి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చిందని, హరికృష్ణ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి అడిగారు. అయితే, అప్పటివరకు పరారీలో ఉన్న హరికృష్ణ పోలీసుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని గ్రహించి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్లో ఈనెల 24న లొంగిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఎక్కడ దక్కించుకుంటాడోనని, తనకు ఆమె దూరం అవుతుందేమోనని నవీన్‌ను హత్య చేసినట్టు హరిహరకృష్ణ ఒప్పుకున్నాడు. అనంతరం నవీన్‌ మృతదేహాన్ని అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారులోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పక్కన పడేసినట్టు పోలీసులకు చెప్పాడు. పోలీసులు నవీన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హరిహరకృష్ణను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు గురించి రాచకొండ సీపీ చౌహన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిందితుడు హరహరకృష్ణ నవీన్‌ను కత్తితో కడుపులో పొడిచి ఆ తర్వాత మర్మాంగాలను కోశారని తెలిపారు. తల, మొండెం వేరు చేసిన హరిహరకృష్ణ.. నా ప్రియురాలిని ప్రేమిస్తావా అంటూ శరీరం నుంచి గుండెను వేరుచేశాడని పోలీసులు పేర్కొన్నారు. తల, మొండెం వేరు చేశాడు. ఆ తర్వాత నవీన్‌ గుండెను చీల్చాడు. మర్మాంగాలను కోసి.. చేతి వేళ్లను కట్‌ చేశాడు. ఆ తర్వాత ఆ ఫొటోలను అమ్మాయికి పంపించాడు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేస్తామని పోలీసులు వెల్లడించారు. హరిహరకృష్ణపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్టు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.

Spread the love