స్వీప్‌ ‘రివర్స్‌ పంచ్‌’

‘వికెట్‌కు నేరుగా ఆడాలా? వికెట్‌కు అడ్డంగా ఆడాలా?!’.. స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేం దుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు కంగారు పడుతున్న సమస్య ఇది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ అందుకునే అవకాశం ఇప్పటికే కోల్పోయిన కంగారూలు.. వైట్‌వాష్‌ ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గాలు అన్వేషించే పనిలో పడింది. గింగిరాలు తిరిగే బంతితో ఆసీస్‌ను మాయ చేస్తోన్న టీమ్‌ ఇండియా.. కంగారూ శిబిరంలో కొత్త కంగారు పుట్టించింది. అదే స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్‌.
– అయోమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు
– స్పిన్‌పై ఏ షాట్‌ ఆడాలో తెలియని దుస్థితి
నవతెలంగాణ క్రీడావిభాగం
క్రికెట్‌పై ఓ మోస్తరు అవగాహన ఉన్న వారికి ఇది పెద్ద చిక్కు ప్రశ్న కాదు. నాణ్యమైన స్పిన్‌ను ఎదుర్కొనేందుకు ‘స్వీప్‌’ షాట్‌ మంచి అస్త్రమని ఠక్కున చెప్పేస్తారు. మరి, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ సంగతి తెలియదా?!. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. తక్కువ బౌన్స్‌తో దూసుకొచ్చే బంతులను (స్పిన్‌, స్లో బౌలింగ్‌) ఆడేందుకు స్వీప్‌ షాట్‌ అత్యంత సమర్థవంతం. ప్రపంచ క్రికెట్‌లో మహ్మద్‌ అజహరుద్దీన్‌, కపిల్‌ దేవ్‌, ఏబీ డివిలియర్స్‌.. ఇలా ఎందరో క్రికెటర్లు స్వీప్‌ షాట్లతో అద్భుతాలు చేశారు. బౌలర్ల ప్రణాళికలను తలకిందులు చేశారు. బౌలింగ్‌ జట్టు సారథికి కొత్త సమస్యలను సృష్టించారు. అటువంటి స్వీప్‌ షాట్‌ టీమ్‌ ఇండియాపై పని చేయటం లేదు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వీప్‌ షాట్‌ను సమర్థవంతంగా ఆడటం లేదా? లేక టీమ్‌ ఇండియా స్నిన్నర్ల మాయ ముందు స్వీప్‌ షాట్‌ తేలిపోతుందా?!. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశం.
ఆనందం ఆవిరి
నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలు రెండు మ్యాచులు ముగిశాయి. జామ్తా, కోట్ల స్పిన్‌ పిచ్‌లపై మూడు రోజుల్లోనే ఫలితం వచ్చింది. రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. నాగ్‌పూర్‌ టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. భారత స్పిన్నర్ల మాయకు కంగారూ బ్యాటర్ల వద్ద సమాధానమే కరువైంది. అదే న్యూఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా శిబిరం నుంచి కాస్త ప్రతిఘటన కనిపించింది. నాగ్‌పూర్‌ టెస్టులో స్వీప్‌ షాట్‌ను ఆసీస్‌ బ్యాటర్లు పెద్దగా ఆడలేదు. కానీ కోట్ల పిచ్‌పై స్వీప్‌ షాట్‌ను అత్యంత విరివిగా వాడేశారు. అదే ఆ జట్టును నిండా ముంచేసింది!.
న్యూఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఓ దశలో స్వీప్‌ షాట్‌తో స్పిన్నర్లపై పైచేయి సాధించినట్టే కనిపించారు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌ స్వీప్‌ షాట్‌తో భారత్‌పై ఎదురుదాడి చేశారు. ఓ దశలో ఆస్ట్రేలియా 27 స్వీప్‌ షాట్లకు 71 పరుగులు చేసి, కేవలం రెండు వికెట్లే కోల్పోయింది. స్వీప్‌ షాట్‌ మంత్ర పని చేయటంతో రవీంద్ర జడేజా 36 బంతుల్లో 31 పరుగులు.. అశ్విన్‌ ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. స్వీప్‌ షాట్‌ ఫలితాలు కనిపిస్తున్న తరుణంలోనే ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ పడింది. కోట్ల పిచ్‌పై బంతి తక్కువ ఎత్తులో వస్తుండగా.. ఆసీస్‌ బ్యాటర్లు స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌పైనే దృష్టి పెట్టారు. ఫలితంగా చివరి 8 వికెట్లను 28 పరుగులకే చేజార్చుకున్నారు. రవీంద్ర జడేజా పడగొట్టిన 7 వికెట్లలో ఏకంగా ఐదు వికెట్లు క్లీన్‌ బౌల్డ్‌ కావటం విశేషం. స్వీప్‌ షాట్‌తో భారత్‌పై పైచేయి సాధించామనే సంతోషం ఆస్ట్రేలియా శిబిరంలో ఎంతోసేపు నిలువలేదు. ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ స్వీప్‌ షాట్‌పై స్పందించాడు. ‘నాగ్‌పూర్‌ టెస్టులో స్వీప్‌ షాట్‌ ఆడాల్సిన రీతిలో ఆడలేదు. న్యూఢిల్లీ టెస్టులో స్వీప్‌ షాట్‌ను ఆడాల్సిన దానికంటే ఎక్కువగా ఆడారు. అందుకు ఫలితమే రెండు టెస్టుల్లో పరాజయమని’ కమిన్స్‌ పేర్కొన్నాడు.
స్వీప్‌ ‘స్వీట్‌’ కాదు!
న్యూఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దిశగా సాగుతున్న దశలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఆసీస్‌కు షాక్‌ ఇచ్చాడు. 74 పరుగుల అర్థ సెంచరీతో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌ ప్రమాదం నుంచి బయటపడేశాడు. 115 బంతులు ఆడిన అక్షర్‌ పటేల్‌ 9 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. రవీంద్ర జడేజా 74 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. అయితే, అటు అక్షర్‌ పటేల్‌, ఇటు రవీంద్ర జడేజా స్వీప్‌ షాట్‌ వైపు వెళ్లలేదు. స్వీప్‌ షాట్‌పై జడేజాతో మాట్లాడుతూ అక్షర్‌ ఈ విధంగా అన్నాడు. ‘ ఈ పిచ్‌పై స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడటం కష్టం. అందుకే నేను ఆ ప్రయత్నం చేయలేదు. అందుకు భిన్నంగా నేను ప్యాడ్ల ముందు బ్యాట్‌ను తీసుకొచ్చి ఆడాను. నేను చివరగా జడేజాతో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు.. ఆసీస్‌ బౌలర్లు నా ప్యాడ్లను (ఎల్బీడబ్య్లూ కోసం) టార్గెట్‌ చేశారని చెప్పాడు. దీంతో నేను ప్యాడ్లను కాపాడే పనిలో పడ్డాను. మంచి బంతులను గౌరవిస్తూ పరుగులు సాధించాను. ఇటువంటి పిచ్‌పై ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా మంచి బంతి వస్తుందనే మైండ్‌సెట్‌తో ఆడాలి. డిఫెన్స్‌పై నమ్మకం ఉంచి, స్పిన్‌పై నేరుగా ఆడేందుకు ప్రయత్నించాను. విరాట్‌ కోహ్లి, జడేజా భాగస్వామ్యం సైతం స్పిన్‌ను నేరుగా ఆడుతూ సాగింది’ అని అక్షర్‌ అన్నాడు. ‘భారత్‌లో, ప్రత్యేకించి ఇటువంటి పిచ్‌లపై ఆడుతున్నప్పుడు స్పిన్నర్ల బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ శైలి ఎక్కువగా స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ ఆడేందుకు అనుగుణంగా సాగింది. దీంతో నేడు వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేశాను. స్వీప్‌ షాట్‌ మిస్‌ అయితే బంతి నేరుగా వికెట్లను గిరాటేసేలా బంతులేశాను. తక్కువ బౌన్స్‌తో దూసుకెళ్లిన బంతులు స్వీప్‌ షాట్‌ను ఛేదిస్తూ వికెట్లను తగిలాయి’ అని రవీంద్ర జడేజా అన్నాడు.
జామ్తా, కోట్ల పిచ్‌పై బంతి మరీ తక్కువ బౌన్స్‌ అయ్యింది. దీంతో ఇటువంటి పిచ్‌లపై స్వీప్‌ షాట్‌ అంత ప్రయోజనకరం కాదు. నాగ్‌పూర్‌ టెస్టులో స్వీప్‌ షాట్‌ ఆడకుండా తప్పు చేసిన ఆస్ట్రేలియా.. న్యూఢిల్లీ టెస్టులో ఎక్కువగా ఆ షాట్‌నే వాడింది. ఏకంగా 9 మంది ఆసీస్‌ బ్యాటర్లు స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోయి వికెట్‌ కోల్పోయారు. స్వీప్‌ షాట్‌తో ఆసీస్‌ బోల్తా కొట్టిన చోట.. స్పిన్‌ను నేరుగా ఎదుర్కొన్న భారత బ్యాటర్లు టెస్టు థ్రిల్లర్‌లో విజయవంతం అయ్యారు. అందుకే, టెస్టు క్రికెట్‌లో స్వీప్‌ షాటే కాదు.. ఏ షాట్‌ అయినా పిచ్‌, పరిస్థితులు, బౌలర్లను బేరీజు వేసుకునే ఆడాల్సి ఉంటుంది. చివరి రెండు టెస్టుల్లోనైనా ఆస్ట్రేలియా ఈ పొరపాటు సరి చేసుకుంటుందా? చూడాలి.

Spread the love