హత్రాస్‌ కేసులో ప్రధాన నిందితుడికి జీవితఖైదు

–   మరో ముగ్గురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు
–   హైకోర్టులో సవాలు చేస్తాం : బాధితురాలి కుటుంబీకుల తరఫు న్యాయవాది
లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని హత్రాస్‌ సామూహిక లైంగికదాడి, హత్య కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పును వెలువర్చింది. ప్రధాన నిందితుడికి జీవిత ఖైదును విధించింది. అలాగే, మరో ముగ్గురు నిందితులను నిర్ధోషులుగా తేల్చింది. ఈ మేరకు జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఆదేశించింది. ప్రధాన నిందితుడికి వ్యతిరేకంగా లైంగికదాడి ఆరోపణలు నిరూపితం కాలేదని ఆయన తరఫు న్యాయవాది మున్నా సింగ్‌ పుందిర్‌ అన్నారు. ఐపీసీలోని సెక్షన్లు 304, 302 కింద న్యాయస్థానం సందీప్‌ (20)ను దోషిగా తేల్చి శిక్ష విధించింది. రూ. 50 వేల జరిమానానూ విధించింది. మరో ముగ్గురు నిందితులు రవి(35), లవ్‌ కుశ్‌(23), రాము(26) లను నిర్దోషులుగా తేల్చింది. న్యాయస్థానం తీర్పుపై హైకోర్టులో సవాలు చేస్తామని బాధితురాలి తరఫు న్యాయవాది సీమా కుష్వాహా అన్నారు.2020, సెప్టెంబర్‌ 14న ఒక దళిత బాలికపై నలుగురు పెత్తందారీ కులస్థులు అతి దారుణంగా లైంగికదాడి జరిపిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అదే నెల 29న ప్రాణాలు విడిచింది. అనంతరం మృతదేహానికి జిల్లా యంత్రాంగం అర్ధరాత్రి బాధితురాలి అనంతరంస్వగ్రామంలో అంత్యక్రియలు జరపడమూ తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో యోగి సర్కారు తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Spread the love