హ‌స్త‌క‌ళ ప్రావీణ్య‌త వెండి న‌గిషీల సృజ‌నాత్మ‌క‌త‌

           అక్కడ చేనేత కార్మికుడు నేసిన చీర అగ్గిపెట్టెలో ఇముడుతుంది.. అక్కడ శిల్పి చేతిలో దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది.. అక్కడ హస్తకళాకారుని చేతిలో పడిన వెండి నగిషీగా చెక్కబడుతుంది.. కులం, మతం, భాషతో సంబంధం లేని నైపుణ్యం వారి సొంతం. హస్తకళతోనే అంతర్జాతీయ స్థాయికి ఎగబాకిన శ్రమైక జీవనం. ప్రాచీనం నుంచి మొదలుకుని ఆధునికం వరకు.. గ్రామం నుంచి అంతర్జాతీయం వరకు వారి చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించికున్న ఘనత వారిది. ఇంతకు వారెవరు? ఏం చేస్తారు? ఎక్కడుంటారు? తెలుసుకోవడానికి ముందు ఈ ప్రాంతం గురించి కాస్త చెప్పుకోవాలి. ఒకప్పుడు ఈ జిల్లా నక్సల్స్‌కు కంచుకోటగా పిలువబడేది. కానీ మారుతున్న కాలం కొత్త అధ్యాయానికి తెరదీసింది. ఇప్పుడు ఉద్యమాలకు ఊపిరిగా, పోరాటాల పొలికేకగా ముందుకు సాగుతున్నది. హస్తకళలకు పుట్టినిల్లుగా వర్ధిల్లుతున్నది. ప్రతిభకు పట్టం కడుతున్నది. అదే కరీంనగర్‌. నాటికీ.. నేటికీ ఇక్కడి కళాకారుల హస్తకళను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే. ఎక్కడున్నా వారిని అభినందించాల్సిందే. దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే వారి కళకు సాటి ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. అందులో ప్రాముఖ్యతను చాటుతున్న ‘సిల్వర్‌ ఫిలిగ్రీ’ గురించి ‘సోపతి’ అందిస్తున్న స్పెషల్‌ స్టోరీ..

దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు. ప్రజా పోరాటాలతో రాష్ట్రం సాధించినందుకు. అలాగే ఇక్కడి ప్రాంతాలు కూడా ఎప్పడి నుంచో పేరెన్నికగా నిలుస్తున్నాయి. సిరిసిల్ల అనగానే మనకు చేనేత చీరలకు ప్రత్యేకం. నిర్మల్‌ అంటే కొయ్యబొమ్మలకు పెట్టింది పేరు. రామడుగు.. శిల్పకళకు గురువు. అంకాపూర్‌ అదో వ్యవసాయ క్షేత్రం. ప్రజల జీవనోపాధితో పాటు వారి నైపుణ్యం చరిత్రలో ఒకొక్కటిగా పొందుపరిచింది. అందులో భాగమే కరీంనగర్‌ వెండి నగిషీల కథ. ఈ ప్రాంతం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడ పురుడు పోసుకున్న ఉద్యమాలు జగమంతా విస్తరి స్తున్నాయి. ఇక్కడి చేతివృత్తులు, హస్తకళలు అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి అవుతున్నాయి. భారతదేశం లోనే కరీంనగర్‌కు చెందిన హస్తకళ ఫిలిగ్రీ ఎక్కడ లేని పేరును తీసుకొస్తున్నది. ఈ కళ దాదాపు నాలుగు వందల ఏండ్ల నుంచి గోల్కోండ నవాబులు, ఆసిఫ్‌ జాహీలు, కుతుబ్‌షాహీల కాలంలో ఈ కళ వెలుగొందింది. ఇప్పటికీ సాలర్‌జంగ్‌ మ్యూజియం లో ఆనాటి సిల్వర్‌ ఫిలిగ్రీ వస్తువులు ఉన్నాయి. 120 సంవత్సరాల క్రితం ఎల గందుల జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత కరీంనగర్‌గా రూపాంతరం చెందింది. అంతకుముందు కరీంనగర ్‌ను అరిపిరాల, సబ్బినాడు అని కూడా పిలిచే వారు. సయ్యద్‌ కరీముద్దీన్‌షా పరిపాలనలో ఆ పేరు సిద్ధించింది. ఎలగందుల కోటను కాకతీయులు నిర్మించారు. ఆ తర్వాత కుతుబ్‌ షాహీలు ఆక్రమించుకు న్నారు. ఈ చారిత్రకమైన ఎలగందులలోనే సిల్వర్‌ ఫిలిగ్రీ కళ మొదలైంది. ఇదొక చేతివృత్తి. వెండి, బంగారం పనిచేసే స్వర్ణకారులే ఈ ఫిలిగ్రీని చేపట్టారు.

హస్తకళాకృతి బహుమతి..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ఏ అతిథికైనా అందమైన హస్తకళాకృతి బహుమతిగా ఇస్తున్నదంటే అది కరీంనగర్‌లో తయారు చేసిందే అయి ఉంటుంది. ఎందుకంటే అప్పటి అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు మన ముఖ్యమంత్రి కానుకగా ఇచ్చింది సిల్వర్‌ ఫిలిగ్రీ కళాకృతే. రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు అందరూ ఈ కరీంనగర్‌ కళను జ్ఞాపకంగా పొందినవారే. కరీంనగర్‌లో విలసిల్లుతున్న ఈ హస్తకళ గ్రీక్‌ దేశం నుంచి వచ్చిందని చరిత్రాకారులు చెబుతారు. కోటిలింగాల తవ్వకాల్లో నుస్తులాపూర్‌లో దొరికిన గ్రీకు నాణేల ద్వారా లభ్యమైన ఆనవాళ్ల ప్రకారం ఇలాంటి కళ లకు సంబంధించిన వస్తు వులు దొరికాయని పురా వస్తు చరిత్రకారులు చెబు తున్నారు. తొలి శాతవాహ నుల కాలం నుంచి విదేశీ వర్తక సంబంధాలు ఉండేవని సమాచారం. అక్కడి నుంచి వచ్చిన ఈ హస్తకళ ఎల గందులలో స్ధిర పడింది. అటు తర్వాత ఒడిషాలో కటక్‌ ప్రాంతంలో వీటిని పోలిన వస్తువులు తయారు చేస్తున్నారు. ఇది వెండి లేదా బంగారంతో తయారు చేస్తారు. నిజాంలు. ఆసిఫ్‌ జాహీల కాలం లో బంగారం ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం వెండికే పరిమితమైంది. ఎల గందుల జిల్లా కేంద్రం కరీంనగర్‌కు మారిన తర్వాత ఈ వృత్తి కూడా కరీంనగరానికి చేరింది.
అలంకరణ కళ
నగిషీలను తయారు చేయడానికి ముందు గా వెండిని సన్నని తీగలుగా సాగ దీస్తారు. ఆ తీగలను ముందుగా అనుకున్న డిజైన్‌ ప్రకారం ఏనుగు, వీణ, రథం, పక్షి లాంటి పలు ఆకృతులుగా మలుస్తారు. ఒక్కో వస్తువు తయారు కావడానికి నెలలు పడుతుంది. నగిషీలు అద్దిన ఆభరణం అలంకార ప్రాయమే కావచ్చు కానీ అందులో నాట్యం చేస్తున్న నెమళి రూపు మనల్ని ముగ్దులను చేస్తుంది. వెండి తీగలను బొరాక్‌్‌స పొడితో బేపైప్‌ ద్వారా అతికిస్తారు. ఈ లోహపు తీగను మెలితిప్ప అతి సన్నం చేస్తారు. మహిళలకు జూకాలు, నెక్లెస్‌లు, పట్టీలు చేస్తారు. తయారీలో శ్రమ ఎక్కువ ఉండటం వల్ల కొంత వ్యయం కూడా ఎక్కువ అవుతుంది. ఇదొక సృజనాత్మకైమన కళ పాత తరం నుంచి వచ్చి వాటినే తిరిగి తయారు చేయడం కాకుండా ఆధునిక ఆలోచనలతో తయారు చేస్తారు. 2017లో జరి గిన అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా కూడా ఈ కళాకృతులు బహుమతులుగా అందు కుంది. ఇవాంకా ఒక్కరే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రు లకు, రాష్ట్రపతులకు బహుకరించే వీణలు, చార్మినార్‌ కళాకృతులు కరీం నగర్‌ కళాకారుల చేతిలో రూపొం దినవే. ఇంకా వీటితో పాటు హంస బొమ్మలు కూడా అవసరమైన సైజుల్లో ఆర్డర్లపై తయారు చేస్తారు. వినియోగ దారులకు ఇష్టమైన రీతిలో ఇచ్చేందుకు కష్టపడతారు. ఒకప్పుడు పాత పద్ధతు లకు అనుగుణంగా తయారు చేసిన ఈ సిల్వర్‌ ఫిలిగ్రీ వస్తువులు ప్రస్తుతం మారిన కాలానికి, కస్టమర్స్‌ ఆలోచ నలకు అనుగుణంగా కొత్త మోడల్స్‌ తయారు చేసి అందిస్తున్నారు.
హస్తకళ అంతరించే ప్రమాదం..
రానురానూ ప్రాచీన, సూక్ష్మ హస్త కళ అంతరించిపోయే ప్రమాదముంది. ఈ వృత్తిని నమ్ముకున్న పాతతరం వారే జీవం పోస్తున్నారు. నిరంతరం కూర్చోని చేసే పని, కంటిదగ్గర పెట్టుకుని సూక్ష్మంగా పరీక్షించే పని పట్ల నేటి యువత విముఖత చూపుతున్నది. అందుకే ఎక్కువ మంది కళాకారులను తయారు చేస్తే గనుక సూక్ష్మ కళ అంతరించకుండా ఉండే అవకాశ మున్నది. దీనికి ప్రభుత్వమే చొరవ తీసుకుని సహకర సొసైటీని అభివృద్ధి చేయాలి. దాంతో పాటు సూక్ష్మకళకు సంబంధించిన విద్యను పాలిటెక్నిక్‌ లేదా విశ్వ విద్యాలయాల్లో కోర్సుగా ప్రవేశపెడితే చాలా ఉపయోగం. ఈ కళను పని భారంగా భావించకుండా ఉండే సులభమైన పద్ధతిలో పని, మరింత అత్యాధునిక సాంకేతికం వాడితే ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇటీవల ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల సహాయ ఆచా ర్యులు వనపర్తి సుధాకర్‌ తమ విద్యార్థు లతో ‘జిజ్ఞాస’ కార్య క్రమంలో భాగంగా ఒక ప్రాజెక్టు రూపొం దించారు. విద్యా ర్థులకు హస్తకళల గురించి వివరించారు. వారి అధ్యయనంలో భాగం గా సిల్వర్‌ ఫిలిగ్రీ వృత్తి కళాకారుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకు న్నారు. అరుదైన ఈ కళకు మార్కెట్‌ కూడా ఉన్నది. చేసిన వస్తువులు సరిపోవడం లేదనే డిమాండ్‌ వస్తున్నది. రానున్న కాలంలో చేసేం దుకు వృత్తిదారులు దొర కడం లేదు. ఇప్పుడు నలభై సంవత్సరాల వయస్సు పైబడిన వారే ఈ పనిలో ఉన్నారు. యువకులు రావడం లేదు. అందుకే దీనిని వృత్తి విద్యలో భాగం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. బహుజనుల వృత్తులన్నీ కళాత్మకమైనవే. శ్రమజీవనంలోనే ఆ సొగసు ఉన్నది. వాళ్ల చేతిలోనే అద్భుతమైన నేర్పరి దాగి ఉన్నది. అందుకే వాళ్లు అందమైన చీరలు నేస్తారు. దాని మీద ఆకట్టుకునే బొమ్మలు అల్లుతారు. వాళ్ల సొగసుగా కిర్రు చెప్పులు చేస్తారు. వాటి మీద ఎగిరే పుంజాలను అమర్చుతారు. సుందరమైన కుండలు చేస్తారు. ఆ కుండలమీద జాజు కళతో ఐరేని చేస్తారు. అందమైన బిందెలు, కుర్చీలు, దర్వాజలు, సుందరమైన నగలు ఇలా అన్నింటికీ హస్తకళలే నిదర్శనం.
సహకారం : వనపర్తి సుధాకర్‌
సహాయ ఆచార్యులు, ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల, కరీంనగర్‌

హస్తకళల సొసైటీ ఏర్పాటు
2008లో చేతి వృత్తిదారులం దరూ కలిసి ఎర్రోజు అశోక్‌, గద్దె అశోక్‌ కుమార్‌, ఆకోజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిల్వర్‌ ఫిలిగ్రీ ఆఫ్‌ కరీంనగర్‌ హ్యాండ్‌ క్రాప్ట్‌ వెల్ఫేర్‌ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిని ‘సిఫ్కా’ అంటారు. ఇది సహకార పద్ధతిలో పని చేస్తుంది. దీని ద్వారా కళాకారులకు అవసరైమన పనితో పాటు ఆర్థికసాయంతో అందజేసేందుకు తోడ్పడుతుంది. కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఇక్కడ తయారు చేస్తున్న వస్తువులు చాలా నాణ్యతతో పాటు మన్నికగా తయారు చేసినవి ఉంటాయి. అందుకే చాలామంది అమితంగా ఇష్టపడతారు. పైగా పనిలో సూక్ష్మకళ ఉంటుంది. ఆర్డర్లపై వెండి కళా కృతులను తయారు చేస్తారు ఆ తర్వాత వాటిని ఇక్కడ ‘చందన, హైదరాబాద్‌లోని రాష్ట్రప్రభుత్వం నిర్వహించే గోల్కొండ’ షోరూంల ద్వారా అందిస్తారు. హైదరాబాద్‌, ముంబాయి, ఢిల్లీ లాంటి నగరాల్లో జ్యువెలరీ షాపులకు కూడా ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఈ వృత్తిపై దాదాపు 200 కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయి.సొసైటీ వ్యవస్థాపకులైన ఆ ముగ్గురే వరుసగా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఫిలిగ్రీకి జాతీయ స్థాయి గుర్తింపు
సిల్వర్‌ ఫిలిగ్రీ కళ అంత తొందరగా ఎవరికీ రాదు. దానికి ఏకాగ్రత, ప్రావీణ్యత, సృజనాత్మకత ఈ మూడు కావాలి. అప్పుడే హస్తకళకు న్యాయం జరుగుతుంది. అందుకే దీన్ని సూక్ష్మకళగా చెబుతుంటారు. అంతటి నైపుణ్యత కలిగిన కళ గనుకనే సిల్వర్‌ ఫిలిగ్రీ కళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2015లో ఎర్రోజు వెంకటేశ్వర్లుకు, 2018లో గద్దె అశోక్‌కుమార్‌కు, 2010 ఎర్రోజు అశోక్‌లకు జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం చేతిగుర్తింపు పురస్కారాలు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో వారిని సత్కరించి గౌరవించింది. కరీంనగర్‌లో సహకార సంస్థగా ఏర్పడి ఈ కళను నమ్ముకుని జీవిస్తున్న వారు రానురానూ ఇతర వృత్తుల్లోకి పోతున్నారు. ఇది అందరికీ తొందరగా నేర్చుకోవడానికి కుదరని వృత్తి. ఇందులో కళాత్మకత దాగి ఉన్నది. నేర్పేవాళ్లు ముందు డిజైన్‌ చేసేవాళ్లు, కొత్తకొత్తగా డిజైన్‌ రూపొం దించే ట్రైనర్స్‌ కావాలి. పైగా వెండిలోహం పెట్టుబడితో కూడుకున్నది. ప్రభుత్వమే అరుదైన ఈ కళను భావితరాలకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love