హెచ్‌సీయూలో రణరంగం

–  ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఏబీఈపీ కార్యకర్తల దాడి
– పలువురికి గాయాలు
నవతెలంగాణ-మియాపూర్‌
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రణరంగంగా మారింది. శుక్రవారం విద్యార్థి సంఘాల ఎన్నికలు జరగ్గా.. అదే రోజు అర్ధరాత్రి ఏబీవీపీ నాయకులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివ దుర్గారావు మాట్లాడుతూ.. ఏబీవీపీ నాయకులు తమపై క్రూరంగా దాడి చేశారని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఎఫ్‌ హాస్టల్‌ లోపలికి చొరబడి దాడికి తెగబడ్డారని విమర్శించారు. మద్యం మత్తులో ఏబీవీపీ విద్యార్థి సంఘం సభ్యులు తమను దుర్భాషలాడుతూ గొడవకు దిగారని, హాస్టల్‌పై దాడి చేసి అద్దాలు పగులగొట్టారని తెలిపారు. హాస్టల్‌ ముందు పడి ఉన్న పదునైన గాజు ముక్కలు, సైకిళ్లతో తమపై దాడి చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ఏబీవీపీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, హింసను ఆశ్రయిస్తోందని ఆరోపించారు. దాడులకు వ్యతిరేకంగా విద్యార్థి లోకమంతా ఐక్యంగా నిలబడాలని కోరారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రశాంత వాతావరణంలో జరిగేవని, నేడు ఏబీవీపీ నాయకులు ఈ రకమైన భౌతిక దాడులకు పూను కోవడం దారుణమన్నా రు. దీన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాల న్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తూ ఎన్నికల్లో తమ పానెల్‌ పోటీ చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఏబీవీపీ నాయకులు తమపై అకారణంగా దాడి చేశారని తెలిపారు. ఇలాంటి భౌతికదాడులకు యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పటికీ అవకాశం ఇవ్వొద్దని కోరారు. ఈ విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.

Spread the love