ఈ పనికి ముగింపు ఎన్నడు?

దేశంలోనే మానవ వ్యర్థాలను శుభ్రపరచే వృత్తిలో ఎవరూలేరని కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో ప్రకటించింది. కానీ, అధికారిక లెక్కల ప్రకారమే సెప్టిక్‌ ట్యాంకులు, మురుగు కాలువలను శుభ్రంచేసే క్రమంలో వందల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటనకు, అధికారిక లెక్కలకు పొంతన లేదు. నిజానికి, ఇండియాలో మానవ వ్యర్థాలను తొలగించే పనిలో నిమగమైన వారు యాభై ఎనిమిది వేల మందికి పైగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ విధానాన్ని నిషేధించి, మాన్యువల్‌ స్కావెంజర్లకు పునరావాసం కల్పించేందుకు 2013లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఆ చట్టాన్ని మోడీ సర్కార్‌ అసలు అమలు చేసిందే లేదు. పైగా ఆ కార్మికులే లేరని నిండు పార్లమెంటులో చెప్పింది నిజమేనా?
ఏ ప్రభుత్వమూ తన ప్రజలను చావు కోసం, విష వాయువుల గదుల్లోకి పంపదు. కానీ, మన దేశంలో ప్రతి నెలా నలుగురైదుగురు కార్మికులు పారిశుధ్య పనుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, 2019 సెప్టెంబర్‌ 18న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మ్యాన్‌హౌళ్లు, సెప్టిక్‌ ట్యాంకుల్లో వ్యర్థాలను తొలగించే క్రమంలో ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండటం ఆధునిక సమాజానికే ఒక మాయని మచ్చ. దేశంలో పారిశుధ్య పనుల్లో ఉన్నది తొంభై అయిదు శాతం దళితులే. ఐదు శాతం మంది ఆదివాసులు.
సమాజం మల మూత్రాల మురికి కాల్వగా మారితే, శుద్ధి చేసేది మాన్యువల్‌ స్కావెంజర్లు. సమాజం చెత్త కుప్పగా, కుప్ప తొట్టిగా మారితే రోగాల బారిన పడకుండా శుభ్రం చేసే నిజమైన స్వచ్ఛ సైనికులు వారు. సఫాయి కార్మికులు ఈ విధమైన దోపిడీ పీడనలకు, తీవ్ర సామాజిక వివక్షకు గురవుతున్నప్పుడు, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం-1989ను వర్తింపజేసి, తగిన భద్రత, రక్షణ కల్పించవలసి ఉంటుంది. కానీ, ఎక్కడా ఇది అమలు కావడం లేదు. అంతే కాదు, పదిహేడవ అధికరణం కింద, అంటరానితనం, కుల వివక్షలను నిషేధించిన రాజ్యాంగాన్ని ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలు కూడా ఉల్లంఘిచటం వాటి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. సఫాయి కర్మచారి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా-2014కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, రాష్ట్రాలు చట్టాలకు కట్టుబడి తమ విధులను పాటించకపోవడం… పారిశుధ్య కార్మికుల విషయంలో రాజ్యాంగాన్ని, సంబంధిత చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
సెప్టిక్‌ ట్యాంకులు మనుషులు శుభ్రం చేయడానికి వీలుగా ఉండవు. ఈ సమస్యను స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం సైతం పట్టించుకోలేదు. దుర్గంధ వాయువుల నుంచి పారిశుధ్య కార్మికులను రక్షించుకోడానికి చేతి రుమాళ్లు సరిపోతాయని సంబంధిత కాంట్రాక్టర్లు కొందరు అంటున్నారంటే కార్మికుల ప్రాణాలంటే వారికి ఎంత చులకనో అర్థమవుతుంది. ప్రభుత్వాలు సైతం నేరుగా బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నాయి. వ్యర్థాల తొలగింపులో యాంత్రీకరణను తప్పనిసరి చేస్తూ ఉన్న చట్టాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు అమలుచేయడంలేదు? వీరికి ఇతర ఉపాధి మార్గాలు చూపించకుండా మోడీ సర్కార్‌ ఎందుకు తాత్సారం చేస్తోంది? వారి పునరావాసం, సంక్షేమం కోసం కనీస నిధులు కూడా ఎందుకు ఖర్చు చేయడంలేదు? ఆయా కుటుంబాల పిల్లలకు తగిన విద్యావకాశాలు ఎందుకు కల్పించడం లేదు? వంటి జవాబు లేని ప్రశ్నలనేకం.
దేశీయంగా చాలా ప్రాంతాల్లో మానవ వ్యర్థాలను మురుగు కాలువల్లోకి వదులుతున్నారు. దానివల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. నానాటికీ ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఆ సాంకేతికతతో వ్యర్థాల తొలగింపునకు మెరుగైన యంత్రాలను వాడుకోవచ్చు. అలా చేయకపోవడమే ఈ పరిణామాలకు కారణం. దీనిపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి. మురుగు నీరు, ఇతర వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే ప్రదేశంలోనే వాటిని సురక్షితంగా భూమిలోకి పంపించే పద్ధతులను ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రత్యేక గుంతలు, మురుగు నీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా చూడాలి. అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు వంటి చోట్ల వ్యర్థ జలాన్ని అక్కడే శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. మ్యాన్‌హౌళ్లు వంటి వాటిని శుభ్రం చేయడానికి బండికూట్‌ వంటి రోబోలను విరివిగా వినియోగించాలి. బయో టాయిలెట్ల వంటి సాంకేతికతను ఆచరణలోకి తేవాలి. అందుకు ప్రభుత్వాలు తగినంత నిధులు కేటాయించాలి. స్వఛ్చభారత్‌ అంటూ అందమైన నినాదాలిచ్చే మోడీ సర్కార్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సూచించినట్టుగా సఫాయీ కర్మచారీల ఆర్థిక పరిస్థితిని అంచనావేసి, వారికి తగిన జీవనోపాధి కల్పించాలి.

Spread the love