గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మెన్‌పై.. అవిశ్వాస తీర్మానం వెనుక బాద్‌షా ఎవరు?

– నిఘావర్గాలను రంగంలోకి దించిన బీఆర్‌ఎస్‌ అధిష్టానం
నవతెలంగాణ- గజ్వేల్‌
గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ నేతి చిన్న రాజమౌళిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వెనకనుంచి కథ నడిపిస్తున్న బాద్‌షా ఎవరని బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం గురువారం రాత్రి నుంచి నిఘా వర్గాలను రంగంలోకి దించి ఆరా తీస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ముఖ్య నాయకులపై నిఘా పెట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నట్టు నిఘా వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మెన్‌పై అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం రాబోయే ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం చూపుతుందని స్థానికులు భావిస్తున్నారు. మున్సిపల్‌ చైర్మెన్‌పై అవినీతి ఆరోపణలు చేయడం.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశాలను గత కో ఆప్షన్‌ ఎన్నికల నుంచి కౌన్సిలర్లు పట్టించుకోకపోవడం తదితర అంశాలపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌కు తాము వ్యతిరేకం కాదని, కేవలం మున్సిపల్‌ చైర్మెన్‌ను మార్చాలనే డిమాండ్‌ తోనే అవిశ్వాస తీర్మాన పత్రాన్ని కలెక్టర్‌కు అందిం చినట్టు 14 మంది సభ్యులు పేర్కొంటున్నారు.
కాగా, గజ్వేల్‌ మున్సిపల్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇది సీఎం కేసీఆర్‌ కృషితోనే సాధ్యమయిందని, అందరూ బాధ్యతతో పని చేయాల్సిన అవసరం ఉందని మున్సిపల్‌ చైర్మెన్‌ రాజమౌళి అంటున్నారు. కౌన్సిలర్లకు, చైర్మెన్‌కు మధ్య ఐక్యత లేకపోవడంతో అవిశ్వాసం వరకు వెళ్లినట్టు సమాచారం. ఈ సమయంలో అవిశ్వాస తీర్మానం అవసరమా అని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అవిశ్వాసాలపై కోర్టు స్టే ఉన్నప్పటికీ గజ్వేల్‌ – ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు తీసుకున్న నిర్ణయం మంచిది కాదని పార్టీ సీనియర్లు అంటున్నారు. మంత్రులకు నిఘావర్గాలు నివేదిక అందిస్తున్నట్టు తెలిసింది. గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస పత్రాన్ని అందించి 14 మంది కౌన్సిల్‌ సభ్యులు టూర్‌కు వెళ్లారు. కౌన్సిల్‌ సభ్యుల సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో పార్టీ అధిష్టానానికి ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొన్నది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న బాద్‌షా ఎవరో తెలుసుకుని… అతనితో చర్చించి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకునే విధంగా చేయాలని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులను పార్టీ అధిష్టానం ఆదేశించినట్టు తెలిసింది.

Spread the love