లాజిక్‌ మిస్సయిన సర్కార్‌

భూమి రైతుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. అదే భూమిని ప్రభుత్వమేగానీ, ప్రయివేటు వ్యక్తులెవరైనా అక్రమంగా గుంజుకుంటే ఆ రైతు మనస్సు కాకవికలమవుతుంది. ధరణి చేసిన మాయతో ఎంతో మంది దళితులకు అరణ్యరోధనే మిగిలింది. దశాబ్దాల కిందట దళితులకు ఇచ్చిన అసైన్డ్‌, ఇనాం, భూదానం, గైరాన్‌ భూములను లాగేసుకుంటుంది. ప్రభుత్వ అవసరాల పేరు చెప్పి దళితుల సాగుబడితో ఉన్న భూములనే స్వాధీనం చేసుకుంటుంది. ఇటీవల సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రైతులు నిర్వహించిన అసైన్డ్‌ భూబాధితుల సదస్సు ఒకటి జరిగింది. అందులో ఓ రైతు మాట్లాడుతూ భూములను కొల్ల గొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని బట్టబయలు చేశాడు. అందుకు అనేక ప్రశ్నలను సంధించాడు. సెల్‌ఫోన్‌ రీచార్జ్‌ చేయగానే కంపెనీ నుంచి సెల్‌కు సమాచారం వస్తుంది. బ్యాంకులో డబ్బులేసినా, తీసినా, వేరే అకౌంట్‌కు బదిలీ చేసినా, వెంటనే మనకు మేసేజ్‌ వస్తుంది. ఆధార్‌కార్డు ఆప్‌డేట్‌ చేసినా ఫోన్‌కు మేసేజ్‌ వస్తుంది. బట్టల దుకాణంలో బట్టలు కొన్నా… ఆస్పత్రిలో వైద్యం జరుగుతున్నా… మేసేజ్‌ల మీద మేసేజ్‌లు వస్తున్నాయి. విద్యార్థులకు ఫలితాలు కూడా మేసేజ్‌ రూపంలో వస్తుంటాయి. అంత టెక్నాలజీ పెరిగింది. అయితే మన రాష్ట్రంలో ప్రతి రోజు కొన్ని కోట్ల విలువైన భూములు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయినా పలానా రైతు భూమి మరో రైతు పేరు మీదికి మారినట్టు సెల్‌ఫోన్‌కు మేసేజ్‌ ఎందుకు రావడం లేదు. ధరణిలో ఆ అప్షన్‌ ఎందుకియ్యలేదు. భూముల క్రయవిక్రయాల్లో సెల్‌ఫోన్లకు మేసేజ్‌ వస్తే భూరికార్డుల మార్పు వెంటనే బాధితుడికి తెలిసిపోతుంది. దీంతోపాటు భూములు అన్యాక్రాంతమైనట్టు కూడా ఆ పట్టాదారుడికి సమాచారం అందుతుంది. మరెవరైనా కబ్జాకు పాల్పడ్డారా? లేదా కొన్నాడా, అమ్మాడా అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. భూమి చిరగని వస్త్రం…దానిపై జరుగుతున్న లావాదేవీల్లో ఈ చిన్న లాజిక్‌ సర్కారు మిస్సయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
– గుడిగ రఘు

Spread the love