సద్దిమూటలతో పోరుబాట

బహిరంగ సభలు, మహాధర్నాలకు బీరూబిర్యానీ, రూ.500 నుంచి రూ.1000 ఇచ్చినా గానీ జనాలు వచ్చుడు అంతంతే. వచ్చినోళ్లూ కుదురుగా కూర్చోవటం అరుదే. ప్రదర్శనలో నడవాలంటే ఎక్స్‌ట్రా ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో ఇది ఓ ట్రెండ్‌గా మారింది. కాదుకాదు..బూర్జువా పార్టీలు అలా మార్చేశాయి. వాహనం దగ్గర నుంచి అన్నీ సమ కూర్చిపెట్టి జనాలను తరలించడం పరిపాటిగా మారింది. అంతజేసినా సభదాకా వెళ్తారా? అంటే అదీ లేదు. ‘అబ్బే ట్రాఫిక్‌జామ్‌ అయితది. మళ్లీ ఇంటికి పోవాలంటే రెండు, మూడు గంటలు లేటవుతుంది. వచ్చామా? బీరూబిర్యానీ పుచ్చుకున్నామా? డబ్బులు ముట్టాయా? ఇంటికి పోయామా?’ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇది నాణా నికి ఓ వైపు మాత్రమే. మరోవైపు పరికించి చూస్తే కమ్యూ నిస్టుల ధర్నాలు, సభలు దానికి భిన్నమని మరోమారు నిరూపితమైంది. సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల హక్కుల కోసం చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో సభ పెట్టారు. గ్రామపం చాయతీ కార్మికులు జిల్లాల నుంచి ఐదారువేల మంది తరలొచ్చారు. ట్రైన్లు, బస్సులలో ఎవరి సొంత ఖర్చులతో వారే పొద్దుగాల్నే పట్నం చేరుకున్నారు. పంచాయతీ కార్మికులంతా ఎవ్వరి సద్ది వారే కట్టుకుని సద్దిమూటలు, నీళ్ల బాటిళ్లు, క్యాన్లతో వచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్కు ఎన్టీఆర్‌ స్టేడియం, ఇలా దొరికిన చోటల్లా కార్మికులు ఎక్కడికక్కడ రౌండ్‌గా కిందనే కూర్చొని తమ వెంట తెచ్చుకున్న సద్ది మూటలతో కడుపునింపుకున్నరు. ‘లచ్చలకు లచ్చల జీతాలు తీసుకునేటోళ్లకు మళ్లా పెంచుకున్నరు. మనకెందుకు పెంచరు? రూ.8,500 ఇచ్చి ఇద్దరు, ముగ్గురు పంచుకుని నెలంతా ఎట్ట బతకాలే? ఇయ్యాలరేపట్ల మూడు, నాలుగు వేల రూపాయలకు ఏమొస్తున్నది? జీతం పెంచేదాకా పోరాటం ఆపొద్దు’ అంటూ తినేదగ్గరా మాట్లాడుకోవటం గమనార్హం. సద్దిమూటలతో వచ్చిన వారిలో నిలువెల్లా పోరాటతత్వం తొణికిసలాడుతున్నది. వారిలా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలుగానీ ఇసుమెత్తయినా ఆలోచించినా కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేవే.
– అచ్చిన ప్రశాంత్‌

Spread the love