గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో 10 మంది మృతి

నవతెలంగాణ – గుజరాత్: గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా నృత్యం చేస్తూ పలువురు గుండెపోటుకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. బాధితుల్లో యువత, మధ్య వయసు వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరణించినవారిలో బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు వరుసగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి కన్నుమూశాడు. ఇక కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా చనిపోయాడు. నవరాత్రుల మొదటి 6 రోజులలో గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి 108 అంబులెన్స్ సర్వీసులకు ఏకంగా 521 కాల్స్ వచ్చాయంటే అక్కడి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శ్వాస ఆడకపోవడానికి సంబంధించి 609 కాల్స్ వచ్చాయని, గర్బా వేడుకలు జరిగే సమయం సాయంత్రం 6 మరియు తెల్లవారుజామున 2 గంటల మధ్యలోనే ఈ కాల్స్ వచ్చాయని అధికారులు వివరించారు.

 

Spread the love