రోడ్డుపై కుప్పకూలిన విమానం… 10మంది మృతి

 రోడ్డుపై కూలి పేలిన విమానం
రోడ్డుపై కూలి పేలిన విమానం

నవతెలంగాణ కౌలాలంపూర్: ఒక చిన్న విమానం రహదారిపై కూలింది. ఆ తర్వాత పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ విమానంలోని ఎనిమిది మంది, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులతో సహా పది మంది మరణించారు. మలేషియాలో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం ప్రైవేట్‌ జెట్‌ విమానం రిసార్ట్ ద్వీపమైన లంకావి నుంచి టేకాఫ్‌ అయ్యింది. రాజధాని కౌలాలంపూర్‌కు పశ్చిమాన ఉన్న సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పైలట్‌ ప్రయత్నించాడు. కాగా, నియంత్రణ కోల్పోయిన ఆ విమానం నిటారుగా ఒక రోడ్డుపై కూలింది. అనంతరం పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణించిన ఆరుగురు వ్యక్తులు, ఇద్దరు విమాన సిబ్బంది మరణించారు. అలాగే రోడ్డుపై కారు డ్రైవ్‌ చేస్తున్న ఒక వ్యక్తి, బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తి కూడా చనిపోయినట్లు మలేషియా అధికారులు తెలిపారు.
మరోవైపు ఆ విమానంలో ప్రయాణించిన సెంట్రల్ పహాంగ్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు జోహారీ హరున్ ఈ ప్రమాదంలో మరణించినట్లు మలేషియా పౌర విమానయాన అథారిటీ చీఫ్ నోరాజ్‌మాన్ మహమూద్ తెలిపారు. విమానం కూలడానికి ముందు పైలట్‌ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు చేయలేదని చెప్పారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, ఆ రోడ్డుపై వెళ్తున్న ఒక కారు డ్యాష్‌ బోర్డ్‌పై ఉన్న కెమెరాలో ఈ సంఘటన రికార్డ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Spread the love