కోల్‌ దామ్‌ రిజర్వాయర్‌లో చిక్కుకున్న 10 మంది

నవతెలంగాణ – షిమ్లా: ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌కు మరో ముప్పు పొంచిఉన్నది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆరెంజ్‌ అలర్జ్‌, నేడు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. ఇక భారీ వర్షాలతో ఛంబా, మండి జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల వల్ల కొండ చరియలు విరిపడుతాయని, నదులు, వాగుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల మనాలిలోని కోల్‌ దామ్‌ రిజర్వాయర్‌లో పది మంది చిక్కుకుపోయారు. వారిలో ఐదుగురు అటవీ సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని మండీ డిప్యూటీ కమిషనర్‌ అరిందమ్‌ చౌధరీ వెల్లడించారు. జలాశయంలో ఒక్కసారిగా నీటిమట్టం పెరడటంతో బోటులో వెళ్లిన పదిమంది కోల్‌ దామ్‌లోనే చిక్కుకుపోయారని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని తెలిపారు.

 

Spread the love