– మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
– కలెక్టరేట్ ముట్టడి
నవ తెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, తరుగు పేరుతో కోతపెట్టిన 10 శాతం ధాన్యం డబ్బులను రైతు ఖాతాలో చెల్లించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. సోమవారం రైతులు నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రాత్రింబవళ్లు కష్టపడి సాగు చేసిన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొస్తే దళారులు నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నిబంధనలూ పెట్టకుండా కొనుగోలు చేయాల్సి ఉందని, అధికారులు నిబంధనలను బేకాతర్ చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మార్కెట్లో కొనుగోళ్లలో సంచి దగ్గర రెండు కేజీల ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని చెప్పారు. మిల్లర్లకు ప్రభుత్వమే తరుగు పేరుతో నూటికి పది రూపాయలు ఇస్తుంటే, మరో పది రూపాయలు రైతుల నుంచి ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా ఒక లారీకి రూ.35 వేలు మిల్లర్లు లాభపడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆరుగాలం కష్టం చేసిన రైతుకు మిగిలేది నూటికి పది రూపాయలు అయితే.. అవి కూడా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఈ విధంగా దగా చేస్తుంటే ప్రజాప్రతినిదులు ఎందుకు నిలదీయడం లేదన్నారు. 2018 ఎన్నికలకు ముందు ఇస్తామన్న రుణమాఫీ ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు తూకం చేసి రైతుల దగ్గర నుంచి 10శాతం తరుగు పేరుతో తీసుకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రాస్తారోకో చేశారు. రైతులతో చర్చలకు వచ్చిన జాయింట్ కలెక్టర్ మోతిలాల్ ఏమీ మాట్లాడకుండానే వెనుతిరిగి పోయారు. జూపల్లి కృష్ణారావుతోపాటు ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌ను, ముఖ్య కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు.