విద్యార్థులపైనే రూ.10 వేల భారం

– ఇంజినీరింగ్‌లో కనీస ఫీజు రూ.45 వేలు
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.35 వేలే చెల్లింపు
– 28,598 మంది అభ్యర్థుల ఆందోళన
– 25,869 మందికి వంద శాతం ఫీజు వర్తింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫీజులు భారీగా పెరిగాయి. దీంతో పేద, బడులు బలహీన వర్గాల విద్యార్థులపై భారం పడనుంది. అయితే తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ప్రతిపాదించిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం కనీస ఫీజు రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంచింది. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మాత్రం రూ.35 వేలే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులపైనే ఆ రూ.పది వేల భారం పడనుంది. గతంలో కనీస ఫీజు రూ.35 వేలు ఉన్నపుడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.35 వేలు చెల్లించేది. కానీ కనీస ఫీజును రూ.45 వేలకు పెంచింది కానీ ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం పెంచకపోవడం గమనార్హం. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ మొదటి విడతలో 70,665 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇందులో 54,467 (77.1 శాతం) మంది అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు 11,555 మంది, ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారు 11,822 మంది, ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకులు పొందిన వారు 2,492 మంది కలిపి మొత్తం 25,869 మందికి వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన 28,598 మందికి మాత్రం రూ.35 వేల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం రూ.35 వేలు చెల్లిస్తున్నట్టు ప్రకటించడంతో అభ్యర్థులపైనే రూ.10 వేల భారం పడుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస ఫీజు పెంచకపోవడంతో పేద విద్యార్థులు కొందరు ఇంజినీరింగ్‌ విద్యకు దూరమయ్యే ప్రమాదమున్నది. ప్రభుత్వం పేద విద్యార్థుల గురించి ఆలోచించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.45 వేలకు పెంచాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
అత్యధిక ఫీజు రూ.1.60 లక్షలు
విద్యాశాఖ జారీ చేసిన జీవో నెంబర్‌ 37 ప్రకారం 40 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో రూ.లక్ష ఆపైన ఫీజులను ఖరారు చేసింది. ఈసారి అత్యధిక ఫీజు రూ.1.34 లక్షల నుంచి రూ.1.60 లక్షలకు పెరిగింది. గతంలో సీబీఐటీలో అత్యధిక ఫీజు రూ.1.34 లక్షలుంటే, ఈసారి ఎంజీఐటీలో అత్యధిక ఫీజు రూ.1.08 లక్షల నుంచి రూ.1.60 లక్షలకు పెరిగింది. ఆ కాలేజీలో ఏకంగా రూ.52 వేలు ఫీజు పెరగడం గమనార్హం. సీవీఆర్‌లో రూ.1.50 లక్షలు, సీబీఐటీ, వాసవి, వర్ధమాన్‌ కాలేజీలకు ఊ.1.40 లక్షల ఫీజు ఖరారైంది. అత్యల్ప ఫీజు మాత్రం రూ.35 వేల నుంచి రూ.45 వేలకు ప్రభుత్వం పెంచింది. రూ.45 వేల ఫీజున్న కాలేజీలు తొమ్మిది ఉన్నాయి. ఈ ఫీజులు 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల బ్లాక్‌ పీరియెడ్‌కు అమల్లో ఉంటాయి.
ఇంజినీరింగ్‌ ప్రవేశాల వివరాలు వివరాలు అభ్యర్థులు
మొదటి విడతలో కేటాయింపు 70,665
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు 54,467
పూర్తి ఫీజుకు అర్హులైన వారు
ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలు 11,555
ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారు 11,822
ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకువారు 2,492
రూ.35 వేల ఫీజుకు అర్హులైన వారు 28,598

Spread the love