భీమేశ్వర వాగులో కొట్టుకుపోయిన 100 గేదెలు

– వాగు ఉద్రుతిని గ్రహించని పశువుల కాపరులు
– బోరుమంటున్న రైతులు
నవతెలంగాణ-తాడ్వాయి : తాడ్వాయి మండలం సంతాయిపేట భీమేశ్వర వాగులో సుమారు 100 గేదెలు గురువారం సాయంత్రం వాగు ఉధృతిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి భీమేశ్వర వాగు ఉప్పొంగి ప్రవహించింది. వాగు ప్రవహించే ప్రాంతంలో చిట్యాల సంతాయిపేట గ్రామాల పరిధిలో వర్షం లేకపోవడంతో పశువుల కాపరులు భీమేశ్వర వాగు ఉధృతిని పసిగట్టలేకపోయారు. ప్రతిరోజు మాదిరిగానే సంతయిపేట గ్రామం నుంచి గేదెలను మేపడం కోసం భీమేశ్వర వాగు దాటించి తీసుకువెళ్లారు సాయంత్రం వరకు మేత మేసిన గేదెలు తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో వాగులో చిక్కుకొని వరద నీటిలో కొట్టుకుపోయాయి. మొత్తం 200 గేదెల వరకు ఉండగా అందులో 100 గేదేలు ఈదుకుంటూ, రాళ్ళ మధ్యన చిక్కుకొని బయటకు వచ్చాయి. మిగతా గేదెల ఆచూకీ కోసం గ్రామస్తులు, రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దొరికిన గేదెను దొరికినట్లు ఒడ్డుకు చేరుస్తున్నారు. సంతాయిపేట పరిసర ప్రాంతాల్లో వర్షం లేకపోవడంతోనే వాగు ప్రవహించే తీరును పశువుల కాపరులు గ్రహించలేకపోయారని స్థానికులు వాపోతున్నారు. ఏదేమైనా భారీ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ప్రమాదవశాత్తు గేదెలు కొట్టుకుపోయినందున ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ శెట్పల్లి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి లు కోరుతున్నారు
Spread the love