నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్‌ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీ నిర్వహణకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాలలో సహకారం అందించాలన్నారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలనే సీఎం ఆలోచన ఎంతో గొప్పదని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందన్నారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని ఆయన కోరగానే అంగీకరించానన్నారు.