వందకు చేరిన ప్రభుత్వ, ప్రయివేటు నర్సింగ్‌ కళాశాలలు

– 23 ఫిజియోథెరపీ, 20 ల్యాబ్‌ టెక్నిషియన్‌ కళాశాలలు
– వైద్య అనుబంధ కోర్సులపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
– గతేడాది నుంచి తొమ్మిది కళాశాలల్లో కొత్తగా 11 అనుబంధ కోర్సులు : సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం వైద్య అనుబంధ కోర్సులపై దృష్టి సారించింది. ఈ మేరకు గురువారం సమాచార, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తొమ్మిదేండ్లలో 21 కొత్త ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేయగా, వచ్చే ఏడాదికి మరో ఎనిమిది కళాశాలలకు అనుమతించడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. ఇవే కాకుండా, అనెస్థీషియా, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ అండ్‌ కార్డియో వాస్క్యూలర్‌, రీనల్‌ డియాలసిస్‌, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, న్యూరో సైన్స్‌, క్రిటికల్‌ కేర్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ రేడియో థెరఫీ, రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, ఆడియోలజీ అండ్‌ స్పీచ్‌ థెరపీ, మెడికల్‌ రికార్డు సైన్స్‌ తదితర 12 అనుబంధ వైద్య ఆరోగ్య కోర్సులకు గతేడాది ప్రభుత్వం అనుమతించింది.
11 కోర్సుల్లో 780 సీట్లకు యూనివర్సిటీ ప్రవేశాలు కలిపించింది. నర్సింగ్‌ సేవల కోసం ఇతర రాష్ట్రాల పై ఆధారపడకుండా ఆయన కళాశాలల సంఖ్యను కూడా ప్రభుతం పెంచింది. దీంతో రాష్ట్రంలో నర్సింగ్‌ కళాశాలల సంఖ్య 100కి చేరుకుంది. అంతే కాకుండా 23 ఫీజియోథెరపీ కళాశాలల్లో 1,100 సీట్లు, 20 ల్యాబ్‌ టెక్నిషియన్‌ కళాశాలల్లో 735 సీట్లకు యూనివర్సిటీ ప్రవేశాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇంటర్‌ తరవాత ఎంబీబిఎస్‌ సీట్లు రాని వారికి ఇలాంటి డిగ్రీ కోర్సుల ద్వారా విద్య, ఉపాధి కలిపించడంతో పాటు అనుబంధ వైద్య సేవలు అభివృద్ధి చెందనున్నాయి.

Spread the love