104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

104 employees
Problems should be solved– రిజ్వీకి టీయుఎంహెచ్‌ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయవర్థన్‌ రాజు ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,350 మంది 104 ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలనీ, పీఆర్సీ ప్రకారం మినిమం బేసిక్‌, డిఏ, హెచ్‌ఆర్‌ఏలు అమలు చేయాలని డిమాండ్‌ కోరారు. థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దు చేసి జీతాన్ని నేరుగా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పిఎఫ్‌, ఈఎస్‌ఐ సెలవులు, సొంత జిల్లాలకు బదిలీలు తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2012 నుంచి ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న వీరందరినీ ఇటీవల 2021 డిసెంబర్‌ నుంచి ఎఫ్‌డిహెచ్‌ఎస్‌ సేవలు ప్రభుత్వం బంద్‌ చేయడంతో ఇందులోని ఉద్యోగులను రీడిప్లారుమెంట్‌ కింద వివిధ సేవలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఐదు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. బడ్జెట్‌ రిలీజ్‌ చేయాలని కోరగా జీవో నెంబర్‌ 550 విడుదల చేస్తూ సుమారు 12.50 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు నాయకులు తెలిపారు. సెకండ్‌ క్వార్టర్‌ బడ్జెట్‌ నేటికి అందకపోవడానికి ప్రధాన కారణం ఆర్థికశాఖలో ఇచ్చిన టోకెన్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆమోదించి రిలీజ్‌ చేయకపోవడమేనని తెలిపారు. దీంతో జీతాలు ఆగిపోయే పరిస్థితి నెలకొందని వివరించారు. తక్షణమే ప్రిన్సిపల్‌ సెక్రెటరీ , కమిషనర్‌ ఆఫీస్‌లోని అధికారులు జోక్యం చేసుకొని ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా జీతాలు విడుదల చేసే విధంగా చూడాలనివారు కోరారు. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో 104 ఉద్యోగుల సంఘం నాయకులు పి.సుభాష్‌ చంద్ర, వి శేఖర్‌,ఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love