ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. 11 మంది మృత్యువాత

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది ట్రెక్కర్లు (పర్వతారోహకులు) మృతి చెందారు. మౌంట్ మరాపి వాల్కనో ఆదివారం నాడు నిప్పులు కక్కింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు 11 మంది పర్వతారోహకులు విగత జీవుల్లా కనిపించారు. మొత్తం 26 మందితో కూడిన పర్వతారోహకుల బృందంలో చాలా మంది గల్లంతయ్యారు. అయితే, అధికారులు ఈ బృందంలో ముగ్గురిని కాపాడగలిగారు. మౌంట్ మరాపి ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా బద్దలవడంతో ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు. కాగా, ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో ఆకాశంలోకి 3 కిలోమీటర్ల ఎత్తున బూడిద ఆవరించింది. అగ్నిపర్వత శకలాలు సమీప గ్రామాలపై పడ్డాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్ లో ఉన్న ఇండోనేషియాలో అత్యధికంగా 130 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో మౌంట్ మరాపి రెండో అత్యంత ప్రమాదకర అగ్నిపర్వతంగా భావిస్తారు. ఈ అగ్నిపర్వతం నుంచి 3 కిలోమీటర్ల దూరాన్ని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు.

Spread the love