11 లక్షల ఎకరాలకు పోడు పట్టాలివ్వాల్సిందే

– రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కొన్ని సెక్షన్లలో అసంతృప్తి
– అపరిష్కృత సమస్యలపై జూన్‌లో ఆందోళనా పోరాటాలు
– 111 జీవోపై పారదర్శకంగా విపక్షాలతో చర్చించాలి
– లెఫ్ట్‌ తోడ్పాటుంటే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కమ్యూనిస్టుల తోడ్పాటు ఉంటేనే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటుందని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశానంతరం బుధ వారం తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిస్థి తులపై చర్చించామని చెప్పారు. రాజకీయ బలాబలాలను అంచనా వేశామన్నారు. ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌ మొదటిస్థానంలో, కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంటాయని వివరించారు. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కొన్ని సెక్షన్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని అన్నారు. పదేండ్ల నుంచి అధికారంలో ఉండడం వల్ల సహజంగానే అసంతృప్తి ఉంటుందన్నారు. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు జరపకపోవడం వల్ల, అనేక విషయాల్లో అప్రజాస్వామిక పద్ధతులను అవలం భించడం కారణంగా ఈ అసంతృప్తి పెరుగుతోందని చెప్పారు. ఇటీవల కొన్ని సెక్షన్ల డిమాండ్లు నెరవేర్చడంపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారని వివరించారు. వీఆర్‌ఏలు, జేపీఎస్‌లు, కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ, బీసీలకు లక్ష రూపాయల సాయం వంటి చర్యలతో ఈ అసంతృప్తి కాస్త తగ్గిందన్నారు.
వచ్చేనెల 24 నుంచి పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమేగానీ, ఎంత మందికి ఇస్తారనేదానిపై అయో మయం సరికాద న్నారు. అర్హత ఉన్న గిరిజనులందరికీ పోడు పట్టాలు వస్తాయా?అన్నది చర్చనీయాంశంగా మారిందని చెప్పారు. 11 లక్షల ఎకరాలకు పోడు పట్టాలివ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. మూడు, నాలుగు లక్షల ఎకరాలకు పట్టాలిస్తారంటూ ప్రచారం జరుగుతున్నదని, అదే నిజమైతే దాన్ని సరిచేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏల మంజూరు, ఇతర సమస్యలు, కార్మికులకు కనీస వేతనాల జీవో సవరణ, పంచాయతీ కార్మికుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాలపై సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలంటూ తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయించిందన్నారు.
బీజేపీ పెరుగుదలకు బ్రేక్‌
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నదని తమ్మినేని చెప్పారు. ఆర్నెళ్ల కిందే రాష్ట్రంలో బీజేపీ పెరుగుదల ఆగిపోయిందన్నారు. ఆ పార్టీ నాయకుల్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయని అన్నారు. కర్నాటక ఫలితాల ప్రభావం కాంగ్రెస్‌లో తాత్కాలికమే తప్ప రాబోయే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉండకపోవచ్చని అన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ చెప్తున్నట్టుగా వందకుపైగా సీట్లు సాధించే అవకాశం లేదన్నారు. 70 నుంచి 80 సీట్లతో అధికారంలోకి రావొచ్చని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కమ్యూనిస్టుల తోడ్పాటు ఉంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం విధానాలపై వామపక్షాలను కలుపుకుని ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో బీఆర్‌ఎస్‌ చొరవ చూపడం లేదని, ఈ లోపాన్ని సరిచేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో అపరిష్కృత సమస్యలపై వచ్చేనెలలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఇండ్లు, ఇండ్లస్థలాలు, పోడు భూములకు పట్టాలు, కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ధరణి, రైతుల ఇబ్బందులు, పంట నష్టపరిహారం అందజేత వంటి సమస్యలపై ఆందోళనా పోరాటాలను నిర్వహిస్తామని వివరించారు. 111 జీవోను మరింత పారదర్శకంగా అన్ని పార్టీలతో చర్చించి ముందుకు సాగాలని కోరారు.
రాజకీయ లబ్దికోసమే రూ.2 వేల నోట్ల రద్దు
రూ.రెండు వేల నోట్ల రద్దు అనవసర చర్య అని తమ్మినేని విమర్శించారు. రాజకీయ లబ్ది పొందడం కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దీనివల్ల నల్లధనం నియంత్రణ, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడేది ఏమీ లేదని చెప్పారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినప్పుడే అది రుజువైందని వివరించారు. ఇప్పుడు రూ.రెండు వేల నోట్లు రద్దు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యమని విమర్శించారు.
లెఫ్టినెంట్‌ గవర్నర్లు, గవర్నర్ల వ్యవస్థ పనికిరానివని అన్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలపై ఆంక్షలు సరైనవి కావని చెప్పారు. ప్రభుత్వాలకే పూర్తి అధికారాలుండాలని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును సీపీఐ(ఎం) బలపరుస్తున్నదని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఏకం కావాలని చెప్పారు. ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరైన మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులుతోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love