బంగారు బిస్కెట్లు పట్టుకున్న బీఎస్‌ఎఫ్‌..12 కోట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : గోల్డ్‌ స్మగ్లింగ్ ‌ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లు అడ్డుకున్నారు. ఒక ఇంటిని చుట్టుముట్టారు. గ్రామస్తుల సమక్షంలో తనిఖీ చేశారు. కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు గ్రామంలోని ఒక ఇంట్లో స్మగ్లింగ్‌ కోసం భారీగా బంగారాన్ని దాచినట్లు బీఎస్‌ఎఫ్‌కు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. కాగా, బీఎస్‌ఎఫ్‌ అధికారులు, జవాన్లు ఆదివారం ఆ ఇంటిని చుట్టుముట్టారు. గ్రామస్తుల సమక్షంలో ఆ ఇంట్లో సోదాలు చేశారు. లోపల దాచిన 86 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 16.07 కేజీల బరువున్న గోల్డ్‌ బిస్కెట్ల విలువ రూ.12 కోట్లకుపైగా ఉంటుందని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసి దీని గురించి ప్రశ్నిస్తున్నారు.

Spread the love