– ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయెట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( పీజీఈసెట్-2023) ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి గురువారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. రాష్ట్రంలో గతనెల 29 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు నిర్వహించిన ఈ రాతపరీక్షలకు 16,563 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 14,882 మంది పరీక్షలు రాయగా, 13,981 (93.95 శాతం) మంది అర్హత సాధించారు. అందులో 8,180 అమ్మాయి లు పరీక్షలకు హాజరైతే, 7,762 మంది అర్హత పొందారు. 6,702 మంది అబ్బాయిలు రాయగా, 6,219 మంది ఉత్తీర్ణులయ్యారు. 19 సబ్జెక్టులకు పీజీఈసెట్ రాతపరీక్షలను నిర్వహించామని కన్వీనర్ రవీంద్రారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్ ఎ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, పీజీఈసెట్ కోకన్వీనర్ జె సురేష్‌కుమార్, కోఆర్డినేటర్ టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫార్మసీలో అధికంగా అర్హత
పీజీఈసెట్‌కు హాజరైన వారిలో ఫార్మసీ అభ్యర్థులే అధికంగా ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 16,563 మంది హాజరుకాగా, అందులో 5,782 మంది ఫార్మసీ అభ్యర్థులే ఉన్నారు. వారిలో 5,679 మంది అర్హత సాధించారు. సివిల్ ఇంజినీరింగ్‌కు 2,443 మంది పరీక్ష రాయగా, 2,239 మంది అర్హత పొందారు. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 2,070 మంది హాజరుకాగా, 1,902 మంది, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు 1,524 మంది పరీక్ష రాస్తే, 1,388 మంది, ఎలక్ట్రానిక్స్‌కు 1,450 మంది రాయగా, 1,250 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా టెక్స్టైల్ టెక్నాలజీకి తొమ్మిది హాజరైతే ఎనిమిది మంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌కు 12 మంది హాజరుకాగా, 10 మంది అర్హత పొందారు.