నవతెలంగాణ-హైదరాబాద్ : ఉగ్రవాద సంస్థలు వినియోగిస్తున్న 14 మొబైల్ మేసేజింగ్ యాప్‌లను కేంద్రం నిషేధించింది. జమ్మూకశ్మీర్‌లో ఆ యాప్‌లను ఎక్కువగా వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్దతుదారులతో కమ్యూనికేట్ చేసేందుకు ఉగ్ర సంస్థలు ఆ యాప్‌లపై ఆధారపడుతున్నాయి. పాకిస్థాన్ నుంచి ఆదేశాలను కూడా ఆ యాప్‌ల ద్వారా కొనసాగిస్తున్నారు. బ్యాన్‌కు గురైన యాప్‌లలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమే, మీడియాఫైర్, బ్రియార్, బీచాట్, నందబాక్స్, కోనియన్, ఐఎంఓ, ఎలిమెంట్, సెకండ్‌లైన్, జాంగి, త్రీమాలు ఉన్నాయి. సెక్యూర్టీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేసిన ప్రతిపాదనల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారిన యాప్‌లకు చెందిన జాబితాను తయారు చేశారు. భారతీయ చట్టాలకు లోబడి లేనటువంటి యాప్‌ల చిట్టాను కూడా రెఢీ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 లోని సెక్షన్ 69ఏ ప్రకారం 14 రకాల యాప్‌లపై నిషేధం విధించారు. కశ్మీర్ లోయలో ఈ యాప్‌లు ఉగ్రవాద కార్యకలాపాలను రెచ్చగొడుతున్నాయని కేంద్రం ఆరోపించింది.