లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు..14 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : లెబనాన్‌లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్‌ చేసి పేల్చేశారు. వీటితోపాటు సౌర పరికరాలనూ పేలుళ్లకు వినియోగించుకున్నారు. ఈ ఘటనల్లో 14 మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు. ఇజ్రాయెలే ఈ దాడులకు దిగిందని భావిస్తున్నామని లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. పేజర్ల పేలుళ్లలో ముగ్గురు హెజ్‌బొల్లా సభ్యులు, ఒక బాలుడు మరణించారు. బుధవారం బీరుట్‌లో జరిగిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో వందల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకీటాకీలను పేల్చేశారు. మరోవైపు తీర ప్రాంతంలోని సిడోన్‌లో కారుతోపాటు ఒక దుకాణంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బీరుట్‌లోని పలు ఇళ్లలో సౌర పరికరాలూ పేలిపోయాయి. హెజ్‌బొల్లా గ్రూపునకు చెందిన వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలూ పేలాయి.
లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో తయారయ్యాయి. వాటిపై ఐకామ్‌ అని ఉంది. ఐకామ్‌ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ. అయితే లెబనాన్‌లో పేలిన వాకీ టాకీల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశామని ఐకామ్‌ వెల్లడించింది. చేతుల్లో ఇమిడిపోయే రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హెజ్‌బొల్లా 5 నెలల కిందట కొనుగోలు చేసింది.

Spread the love