నవతెలంగాణ – లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది. గత 24 గంటల్లో యూపీ వ్యాప్తంగా వర్షం సంబంధిత ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. హర్దోయ్ జిల్లాలో నలుగురు, బారాబంకీ జిల్లాలో ముగ్గురు, ప్రతాప్‌గఢ్, కన్నౌజ్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అమేథి, డియోరియా, జాలౌన్, కాన్పూర్, ఉన్నావ్, సంభాల్, రాంపూర్, ముజఫర్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వర్షాల వల్ల మరణించారు. అందులో నాలుగు మరణాలు పిడుగుపాట్ల వల్ల సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. చాలా చోట్ల గాలికి చెట్లు నేలకూలాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి.