టాటా స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం.. 19 మందికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – భువనేశ్వర్‌: ఒడిశాలోని ఢెంకనాల్‌ జిల్లాలో ప్రమాదం జరిగింది. మేరమాండల్‌ ప్రాంతంలో టాటా స్టీల్‌కు చెందిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ పవర్‌ ప్లాంట్‌లో స్టీమ్‌ (ఆవిరి) లీకైంది. దీంతో 19 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బాధితులను కటక్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కలెక్టర్‌ ఉక్కు కర్మాగారం వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంపై టాటా స్టీల్‌ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘‘మేరమాండల్‌లోని టాటా స్టీల్‌ వర్క్స్‌ కర్మాగారంలో బీఎఫ్‌పీపీ2 పవర్‌ ప్లాంట్‌ వద్ద ఆవిరి లీక్‌ కారణంగా ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని అత్యవసర ప్రొటోకాల్‌ సర్వీసులను యాక్టివేట్‌ చేశాం. ఘటన జరిగిన ప్రాంతాన్ని సీజ్‌ చేశాం. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాం’’ అని టాటా స్టీల్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై సంబంధిత అధికారులతో కలిసి అంతర్గత దర్యాప్తును ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఎంతమంది గాయపడ్డారన్న దానిపై కంపెనీ స్పష్టతనివ్వలేదు. ప్రమాదంపై ఢెంకనాల్‌ ఎస్పీ మాట్లాడుతూ.. వేడి నీటితో ఉన్న వాల్వ్‌ ప్రమాదవశాత్తూ తెరుచుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తీవ్రంగా కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది.

Spread the love