రైల్వేల్లో 2.74 లక్షల ఖాళీలు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 2.74లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటిలో ఒక్క సేఫ్టీ కేటగిరీలోనే 1.7లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు రైల్వే శాఖ తాజాగా వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ రైల్వేల్లో ఖాళీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. రైల్వేశాఖలో గ్రూప్‌ సీ కేటగిరీ (లెవెల్‌ 1 లేదా ఎంట్రీ లెవెల్‌ స్టాఫ్‌)లోనే 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. వీటిలో ఒక్క భద్రతకు సంబంధించిన కేటగిరీలోనే 1,77,924 ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 1 నాటికి సేఫ్టీ కేటగిరీలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. 8,04,113 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు సమాధానంలో పేర్కొంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, త్వరితగతిన పదోన్నతులు కల్పించడం, శిక్షణ తర్వాత కోర్‌ ఉద్యోగాలకు నాన్‌-కోర్‌ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్టు రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ తెలిపారు. కాగా, రైల్వేశాఖలో మొత్తంగా 3.12లక్షల నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2022 డిసెంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 1.52లక్షల ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 1.38లక్షల అభ్యర్థులకు నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు.

Spread the love