నవతెలంగాణ – హైదరాబాద్: మొన్నటికి మొన్న టమాటా ఠారెత్తించింది. ఇప్పుడు కందిపప్పు వంతు అయింది. కిలో కంది పప్పు రిటైల్ మార్కెట్ లో 200 రూపాయలకు చేరింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా, కందిపప్పు ధరలు అమాంతం ఆకాశానికి పెరిగేసాయి. కేజీ కందిపప్పు రూ. 150 ఉండగా ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు పెరిగి 200 లకు చేరింది. దీంతో సామాన్య, పేద ప్రజలకు కందిపప్పు అందని ద్రాక్షలా మారిపోయింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కందిపప్పు ధర పెరిగి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. కంది సాగు తగ్గడం, ఉత్పత్తి పడిపోవడంతో పప్పు ధర పెరుగుతుందని చెబుతున్నారు. వచ్చే రోజుల్లో కిలో కంది పప్పు రూ. 200 లకు పైనే ఉండొచ్చని భావిస్తున్నారు.